వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. వైట్ హౌస్ సౌత్ లాన్ నుండి రిపబ్లికన్ పార్టీ తరపున నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఆయన అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు. హృదయపూర్వక కృతజ్ఞతతో, అనంతమైన ఆశావాదంతో, అమెరికా అధ్యక్షుడిగా ఈ నామినేషన్‌ను అంగీకరిస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. అపూర్వమైన మద్దతుతో గౌరవంతో ప్రజల ముందు నిలబడ్డానంటూ ట్రంప్ పేర్కొన్నారు.
గత నాలుగేళ్లలోసాధించిన అసాధారణ పురోగతిపై గర్వపడుతున్నానని తెలిపారు. అలాగే రాబోయే నాలుగేళ్లలో అమెరికా ఉజ్వలమైన భవిష్యత్తుపై అనంతమైన విశ్వాసంతో ఉన్నామని ట్రంప్ అన్నారు. అటు అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్‌పై విమర్శలు కురిపించారు. బిడెన్ అమెరికాను రక్షించేవాడు కాదని, అమెరికా ప్రతిష్టను, ప్రజల ఉద్యోగాలను నాశనం చేసేవాడని ఆరోపించారు. ట్రంప్‌ను ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ పరిచయం చేయగా, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాంకా తన తండ్రి కోవిడ్-19కట్టడికి తీసుకున్న చర్యలు, ఆర్థిక విధానాలపై ప్రసంశలు కురిపించారు. ‘వాషింగ్టన్ డొనాల్డ్ ట్రంప్‌ను మార్చలేదు. డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌ను మార్చారు.’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment