చెక్‌పోస్టుల్లో నిఘా పటిష్టం | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టుల్లో నిఘా పటిష్టం

Published Fri, Apr 19 2024 1:50 AM

జగిత్యాల టవర్‌సర్కిల్‌ వద్ద వ్యాపారుల నుంచి నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు - Sakshi

జగిత్యాలక్రైం: పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లా పోలీసు శాఖ అలర్ట్‌ అయ్యింది. అంతర్‌ జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టేలా చెక్‌పోస్టుల ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ద్వారా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయనున్నారు. ఇందుకు పోలీసులు, ఎన్నికల ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి.

ఏడు చెక్‌పోస్టులు

జిల్లా సరిహద్దులో పోలీస్‌శాఖ ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. మెట్‌పల్లి శివారులోని గండి హనుమాన్‌ దేవాలయం వద్ద, రాయికల్‌ మండలం బోర్నపల్లి బ్రిడ్జి వద్ద, మల్లాపూర్‌ మండలం ఒబులాపూర్‌ బ్రిడ్జి వద్ద, బీర్‌పూర్‌ మండలం కమ్మునూర్‌ వద్ద, ధర్మపురి మండలం రాయపట్నం వద్ద, కొడిమ్యాల మండలం దొంగలమర్రి వద్ద, కథలాపూర్‌ మండలం కలికోట వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలపాటు తనిఖీలు చేపడుతున్నారు. అలాగే జిల్లాలో అదనంగా మరో 9 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు.

పోలీస్‌స్టేషన్ల పరిధిలో తనిఖీలు

అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులను తరలించి ఓటర్లను ప్రలోభపెట్టకుండా ప్రతిపోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోజు పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా డబ్బు, ఇతర ఇతర వస్తువులు తరలిస్తే సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు.

నగదు పట్టివేత..

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.70,56,950 నగదు, రూ.8,17,950 విలువైన 1581 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.3.95 లక్షల విలువైన 15.81 కిలోల గంజాయి, రూ.5,59,858 విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

అప్రమత్తంగా ఉన్నాం

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం. ఇప్పటి వరకు రూ.70,56,590 నగదు, రూ.8,17,950 విలువైన 1581 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నాం. అంతర్‌ జిల్లా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. చెక్‌పోస్టుల్లో సిబ్బంది 24 గంటల పాటు తనిఖీలు చేపడుతున్నాం.

– సన్‌ప్రీత్‌సింగ్‌, ఎస్పీ

మద్యం విక్రయాలపై నిఘా

మద్యం విక్రయాలపై నిఘా పటిష్టం చేశాం. మార్చి 10 నుంచి ఈనెల 17 వరకు 105 గుడుంబా నేరాలను గుర్తించి 17 మందిని అరెస్ట్‌ చేశాం. మద్యం విక్రయిస్తే జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ 87126 58823, జగిత్యాల ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ 87126 58824, ధర్మపురి ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ 87126 58825, మెట్‌పల్లి ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ 87126 58826లో ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. – సత్యనారాయణ,

జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌

జిల్లాలో ఏడుచోట్ల ఏర్పాటు

నామినేషన్ల నేపథ్యంలో నిఘా పెంపు

రూ.70,56,590 నగదు..

1,581 లీటర్ల మద్యం స్వాధీనం

1/2

2/2

Advertisement
Advertisement