తొలిరోజు 8,680 ఇళ్ల సర్వే
జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే జిల్లాలో శనివారం ప్రారంభమైంది. మొత్తం 3,36,076 కుటుంబాలు ఉండగా.. తొలిరోజు 8,680 ఇళ్లలో పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 2,252 మంది ఎన్యుమరేటర్లను నియమించి.. 20 మండలాల్లోని 2,53,923 కుటుంబాలు, ఐదు మున్సిపాలిటీల్లోని 82,153 కుటుంబాలను సర్వే చేయనున్నారు. ఇప్పటికే ప్రతి కుటుంబానికి స్టిక్కర్లు వేశారు. 75 ప్రశ్నలతో కూడిన బుక్‌లెట్ ఉండగా.. అందులో అన్ని వివరాలూ నమోదు చేస్తున్నారు.
కొన్నిచోట్ల ఇబ్బందులు
గ్రామాల్లో ఇప్పటికే అధికార పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. దీంతో ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు కుటుంబాలు సహకరిస్తున్నప్పటికీ కొన్నిటికి సమాధానాలు చెప్పడంలో వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించిన వివరాలు అడిగితే కొందరు చెప్పలేకపోతున్నారు. ఒక్కో కుటుంబానికి దాదాపు 30 నుంచి 50నిమిషాల సమయం పడుతోంది. భూములు, ఆస్తుల వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్న ప్రజలకు ఎన్యుమరేటర్లు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణప్రాంతాల్లో చదువుకోని వారు పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నారు. దీంతో చాలా సమయం పడుతోంది. ఇంకా జిల్లాలో 3,27,396 కుటుంబాల సర్వే చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment