సర్కారు బడిలో ఉపాధ్యాయుల ఫొటోలు
రాయికల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటో ఇక తప్పనిసరిగా ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు బదులు మరొకరు పాఠశాలలో బోధిస్తున్నారని విమర్శలు రావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, గురుకులాలు, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్‌ల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఇక నుంచి తప్పనిసరిగా వారి ఫొటోలతో రూపొందించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 16 కేజీబీవీ, 511 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 83 ప్రాథమికోన్నత, 189 ఉన్నత పాఠశాలలు, 13 మోడల్ స్కూళ్లు, రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 3,100 మంది విద్యాబోధన చేస్తున్నారు.
ఉపాధ్యాయుల ఫొటో తప్పనిసరి
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు, ఇటీవల నూతన ఉపాధ్యాయులు నియామకం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకరికి బదులు మరొకరు పనిచేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. దీంతో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. మండలాలు, పట్టణాలకు దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ఒకరు విధులకు హాజరవుతూ మరొకరు మేనేజ్ చేసే అవకాశానికి ఆస్కారం లేకుండా ఉంటుంది.
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 511
ప్రాథమికోన్నత పాఠశాలలు 83
ఉన్నత పాఠశాలలు 189
మోడల్‌స్కూల్స్ 13
కేజీబీవీ 16
రెసిడెన్షియల్ పాఠశాలలు 2
మొత్తం ఉపాధ్యాయులు 3100
ఫొటో ఏర్పాటు తప్పనిసరి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఉపాధ్యాయుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఈనెల 7న డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఫొటోలు ఏర్పాటు చేయాలి. – రాము, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment