చెరువులో పడి వృద్ధుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని చింతకుంట చెరువులో పడి షేక్ ఇక్బాల్ (58) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డిలోని హనుమాన్‌వాడకు చెందిన షేక్ ఇక్బాల్, సబేర దంపతులకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. చిన్న కుమారుడు జాకీర్ జగిత్యాలలో నివాసం ఉంటాడు. కొద్దిరోజుల క్రితం చిన్న కొడుకు వద్దకు వచ్చి బీట్‌బజార్లో ఉంటున్నాడు. ఈనెల 22న మద్యం తాగేందుకు భార్యను డబ్బులు అడిగాడు. ఆమె తన వద్ద లేవనడంతో కూరగాయలు కోసే కత్తితో సబేర గొంతుకోసి పరారయ్యాడు. సబేరను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ భయంతో షేక్ ఇక్బాల్ చింతకుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సబేర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మన్మథరావు తెలిపారు.
బావిలో పడి రైతు దుర్మరణం
సారంగాపూర్: బీర్‌పూర్ మండలం కండ్లపల్లిలో ఓ రైతు వరినారుకు నీరు పెట్టడానికి వెళ్లి కాలుజారి బావిలో పడి చనిపోయిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఏఎస్సై గజేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిర్రి రాజన్న (65) నారుకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. మోటార్ ఆన్‌చేసే క్రమంలో కాలుజారి బావిలో పడిపోయాడు. రాజన్న ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి పొలం వద్దకు వెళ్లి వెదుకుతుండగా.. బావిలో శవమై కనిపించాడు. రాజన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజన్న భార్య దేవక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై వెల్ల డించారు.
జీడి గింజలతో ముఖంపై దాడి
ధర్మపురి: ఏ పనీ చేయక.. ఖాళీగా తిరుగుతూ మద్యం సేవిస్తుండడంతో ఓ వ్యక్తి జీడిగింజలరసం పూయడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన ధర్మపురిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ముస్లింకాలనీకి చెందిన ఖాజాముసిక్ ఆటో డ్రైవర్. కొంతకాలంగా పనులకు వెళ్లకుండా నిత్యం మద్యం తాగుతూ ఇంట్లో భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న తన బావమరిదులు ఎండీ.అలీ, ఎండీ.అమ్జద్ ముసిక్‌ను ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ముసిక్ భార్య ఆసియా అలియాల్ సమీమ్‌తో కలిసి అలీ, అమ్జద్ ముసిక్ ముఖంపై జీడిగింజల రసాన్ని రుద్దారు. దీంతో ఆయన ముఖంపై గాయాలయ్యాయి. దీంతో బాధితుడు బుధవారం పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు భార్య, బామమరుదులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment