అటవీ భూముల్లో మళ్లీ సాగు
సారంగాపూర్: బీర్‌పూర్ మండలంలోని అటవీశాఖ భూముల్లో పంటల సాగు మళ్లీ కొనసాగుతోంది. భూములకు విలువ పెరగడం.. సాగునీటి సౌకర్యాలు మెరుగుపడడంతో అటవీభూములను కొంతమంది సాగు భూములుగా మార్చి పంటలు పండిస్తున్నారు. ఈ మండలంలో భారీ ఎత్తున అటవీభూములు కబ్జాకు గురికావడంతో ఆ శాఖ అధికారులు సీరియస్‌గా తీసుకుని, కొంతవరకు భూముల ఆక్రమణను కట్టడి చేశారు.
ఉమ్మడి సర్వేలో తేలని ఫలితం
రైతులు అటవీ భూములను ఆనుకుని సాగుచేయడం, రెవెన్యూ భూమి అంటూ ఆ భూములపై భూ యాజమాన్య హక్కులు, పట్టా పొందామంటూ అటవీ అధికారులను అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య హద్దుల విషయంలో వివాదం ఏర్పడింది. 2020–21లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ, రెవెన్యూ శాఖలు తమ హద్దులు నిర్ణయించడానికి సంయక్తంగా ఉమ్మడి సర్వే నిర్వహించాయి. అయినప్పటికీ ఏ శాఖది ఎంత భూమి అని తేలకుండానే సర్వే ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ క్రమంలో మళ్లీ అటవీభూముల్లో కొందరు సేద్యం చేస్తున్నట్లు సమాచారం.
మొదలైన ఆక్రమణలు
బీర్‌పూర్ మండలం కండ్లపల్లి–తుంగూర్ గ్రామాల మధ్య అటవీశాఖ ఏర్పాటు చేసిన నీలగిరి ప్లాంటేషన్‌ను ఆనుకుని ఇటీవల రైతులు కొత్తగా పంటల సాగు చేపట్టారు. అటవీభూమిలో చెట్లు లేని చోట ఆ శాఖ వివిధరకాల ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేసింది. ఐదు హెక్టార్ల నుంచి పది హెక్టార్ల వరకు నీలగిరి ప్లాంటేషన్, ఇతర రకాల చెట్లతో ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో విస్తీర్ణం ఎంత..? ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో ప్లాంటేషన్ ఉందన్న విషయాన్ని గుర్తించడానికి అటవీశాఖ అధికారులు సర్వే నిర్వహిస్తే అక్కడ ఎంత భూమి ఆక్రమణకు గురైందన్న విషయం తేలుతుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. రోల్లవాగు ప్రాజెక్టు సమీపంలోని అటవీ భూముల్లోనూ మట్టి పోసి సాగుకు సిద్ధం చేస్తున్నారు. దీనిపైనా అధి కారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment