జగిత్యాలజోన్: పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఒకరిని హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన బర్లపాటి రాజేశ్వర్ వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పల్లె పోశెట్టితో ఓ విషయమై గొడవ జరగగా రాజేశ్వర్‌పై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య పాత పగలు రగులుతున్నాయి. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరి 24న సాయంత్రం రాజేశ్వర్ పనిపై బయటకు వెళ్లాడు. రాత్రి 9 గంటలైనా ఇంటికి రాకపోయేసరికి భార్య, కూతురు వెతికేందుకు వెళ్లారు. అదే సమయంలో రాజేశ్వర్‌ను పోశెట్టితోపాటు ఆయన కుటుంబ సభ్యులు కత్తులతో పొడుస్తూ కనిపించారు. ఇది చూసి కేకలు వేస్తూ పద్మ భర్త వద్దకు వెళ్లగా నిందితులు పారిపోయారు. వెంటనే రాజేశ్వర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. పద్మ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై వెంకట్‌రావు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శ్రీను దర్యాప్తు చేశారు. పద్మ ఐదుగురిపై ఫిర్యాదు చేయగా.. పోలీసుల విచారణలో పోశెట్టి మాత్రమే హత్య చేసినట్లు రుజువైంది. దీంతో పోశెట్టిపై మాత్రమే కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు టి.రంజిత్, ఎం.కిరణ్‌కుమార్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో పోశెట్టికి యావజ్జీవశిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment