అటవీ ప్రాంతం..చిరుత భయం
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం రంగారావుపేట శివారులో చిరుత పులి మరోసారి సంచరించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన సంగెపు రమేశ్ మొక్కజొన్న పంట రక్షణ కోసం కట్టేసిన పెంపుడు కుక్కను శనివారం అర్ధరాత్రి సమయంలో చిరుత పీక్కుతింది. మిగతా కళేబరం అక్కడే ఉంది. విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు చిరుత సంచరించిందన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే పంటపొలం పక్కన ఆదివారం రాత్రి వరకూ ఉన్న కుక్క కళేబ రం సోమవారం కనిపించలేదు. దీంతో అర్ధరాత్రి చిరుత మరోమారు సంచరించి కుక్క కళేబరాన్ని తిన్నట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు సోమవారం బేస్‌క్యాంప్, అటవీ ప్రాంతంలో గాలించారు.
మేకను పీక్కుతిన్న చిరుత..?
వారం పదిరోజుల క్రితం.. చిరుత రంగారావుపేట పక్కనే ఉన్న తండా అటవీ ప్రాంతంలో ఓ మేకను పీక్కుతిన్నట్లు ఆనవాళ్లు కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పదిరోజుల క్రితం ఆత్మకూర్ శివారులోని అటవీ ప్రాంతం వైపు వెళ్లిన కొందరికీ ఏదో జంతువు సంచరిస్తున్నట్లు కనిపించిందని సమాచారం.అక్కడే చిరుత పాదాలను పోలి ఉన్న ముద్రలు కనిపించడంతో భయాందోళనకు గురైన వారంతా అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగారు. చిరుత సంచరిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ.. అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లొద్దని గ్రామస్తులను కూడా అప్రమత్తం చేశారు.
భయాందోళనలో గ్రామస్తులు
చిరుత సంచరిస్తోందన్న విషయంతో రంగారావుపేట, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. రంగారావుపేటలో అటవీ ప్రాంతం వైపు పొలాలు ఉన్న రైతులు భయంభయంతో పంటపొలాలకు వెళ్తున్నారు. సాయంత్రంలోపే తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. మొన్నటిదా కా ఉదయం 4 లేదా 5 గంటలకే పంటలకు నీళ్లు పా రిచ్చేందుకు వెళ్లిన రైతులు, చిరుత భయంతో ఉద యం 8 తర్వాతే పంటపొలాల వద్దకు వెళ్తున్నారు.
అటవీ ప్రాంతంలో అధికారులు..
రంగారావుపేట శివారుప్రాంతంలోని పాదముద్రలు ఉన్న ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు సోమవారం పరిశీలించారు. రంగారావుపేట అటవీ, పక్క జిల్లాలోని కమ్మర్‌పల్లి అటవీ ప్రాంతం కలిసే ఉంటాయన్నారు. ఈ ప్రాంతాల్లో చిరుతలు ఉండే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. చిరుత ఎల్లప్పుడు ఒకేచోటు ఉండదని, ఇతర ప్రాంతాలకు వెళ్తుందని గ్రామస్తులకు సూచించారు. అటవీ ప్రాంతం వైపు చిరుత సంచరిస్తున్నట్లు కొన్నిచోట్ల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చీకటి పడకముందే తమ ఇళ్లలోకి చేరుకోవాలని తెలిపారు. ఇక్కడి ప్రాంతంలో నిఘా పెడుతామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు, సెక్షన్ ఆఫీసర్ చైతన్యశ్రీ, బీట్ ఆఫీసర్ సత్తర్ పాల్గొన్నారు.
రంగారావుపేటలో మరోమారు చిరుత కలకలం?
కుక్క కళేబరం మాయం
భయాందోళనలో ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment