జమ్మికుంటలో మందుబాబుల వీరంగం
జమ్మికుంట(హుజూరాబాద్): ఓ హోటల్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఆమ్లెట్ కోసం మొదలైన వివాదం.. ఇరువర్గాల దాడికి దారి తీసింది. స్థానికుల వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణంలోని ఓ హోటల్‌లో మద్యం సేవించడానికి సోమవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆమ్లెట్ ఆర్డర్ చేయగా హోటల్ యాజమాని మాస్టర్ లేడని చెప్పాడు. ఆమ్లెట్ కావాల్సిందేనని వారు పట్టుబట్టగా పక్కనే ఉన్న వ్యక్తి మాస్టర్ లేడని చెప్పాడు కదా.. ఎందుకు అడుగుతున్నారని అనడంతో గొడవ మొదలైంది. ముగ్గురూ కలిసి అతనిపై దాడి చేశారు. బాధితుడు తనకు సంబంధించిన ఆరుగురిని ఫోన్ చేసి, పిలిపించాడు. ఇరువర్గాల వారు తమవారిని పిలిపించుకొని, దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 100కు ఫోన్ చేయగా ఇద్దరు హోంగార్డులు వచ్చారు. వారు స్పెషల్ పార్టీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి, లాఠీచార్జి చేశారు. దీంతో అందరూ అక్కడినుంచి పరారయ్యారు. హోటళ్లు, బెల్టు షాపుల్లో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు సాగించడమే ఇలాంటి ఘటనలకు కారణమన్న చర్చ జరుగుతోంది. పోలీసులు గస్తీ పెంచి, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
9 మందిపై కేసు
జమ్మికుంట దాడి ఘటనలో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రవి బుధవారం రాత్రి తెలిపారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అబాది జమ్మికుంటకు చెందిన సాడువ కుమార్, పవన్, జగదీశ్, హుజూరాబాద్‌కు చెందిన అన్నపురెడ్డి క్రాంతి, అర్టీ బిర్యాని హోటల్ యజమాని దాసారపు తిరుపతి, కమలాపూర్ మండలం గుండేడుకు చెందిన జనగాం రాజ్‌కుమార్, పేరవేన కుమార్, బాలవేన నరేశ్, కన్నె అజయ్‌లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బిర్యాని సెంటర్లు, మెస్‌లలో మద్యం సేవించినవారిపై, సహకరించిన ఓనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆమ్లెట్ కోసం వివాదం.. ఇరువర్గాల దాడి
పోలీసుల లాఠీచార్జి
Comments
Please login to add a commentAdd a comment