ఆక్రమించిన ప్రభుత్వ భూములు అప్పగించాలి
● భూములు సరెండర్ చేయకుంటే క్రిమినల్ కేసులు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ఆరు ఎకరాలు అప్పగించిన ఇద్దరు
సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్ మినీసమావేశ మందిరంలో బుధవారం ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన కూనవేని నర్సయ్య గ్రామ శివారులోని సర్వే నంబర్ 464/4లోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని సాగుచేసుకుంటున్నాడని వివరించారు. ఈ భూమికి 2018లో రెవెన్యూ అధికారుల ద్వారా పట్టాదార్‌పాస్ బుక్కు పొందారని కలెక్టర్ తెలిపారు. ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి ముందుకొచ్చారని వెల్లడించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన బుస్స లింగం గ్రామ శివారులోని సర్వే నంబర్ 365/అ/2లో ఎకరం ప్రభుత్వ భూమికి పట్టా పొందారని, ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించేందుకు నిర్ణయించారని వివరించారు. జిల్లాలో ఇంకా ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే ఆ భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని సూచించారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వభూమి ఆక్రమణలో ఉంటూ రైతుబంధు, పీఎం కిసాన్ సొమ్ము రికవరీకి డిమాండ్ నోటీసు జారీచేస్తామని తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని ఏడుగురిని అరెస్ట్ చేశామని, అక్రమ పట్టాల వ్యవహారంలో ఇంకా కొంతమంది రెవెన్యూ అధికారుల హస్తం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఒక్క అధికారి రిటైర్డుమెంట్ అయ్యారని, మరికొందరు ఉద్యోగాల్లో ఉన్నారని తెలిపారు. వారిపై విచారణ సాగుతోందని, తప్పులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment