హ్యాపీ క్రిస్మస్
జనగామ బేతేలు చర్చిలో కేక్‌కట్ చేస్తున్న క్రైస్తవులు
వేడుకలకు ముస్తాబైన చర్చిలు
జనగామ: అందాల తార.. అరుదెంచె నాకై .. అంబర వీధిలో.. అని పాడుకుంటూ క్రీస్తు విశ్వాసులు క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యారు. మానవాళి క్షేమం కోసం శిలువపై రక్తాన్ని చిందించిన కరుణామయుడి కరుణ కోసం ధ్యానిస్తున్నారు. నేడు (బుధవారం) క్రిస్మస్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. క్రీస్తు విశ్వాసులు ప్రధాన కూడళ్లలో భారీ నక్షత్రాలను ఏర్పాటు చేశారు. చర్చి ప్రాంగణాల్లో ఏసు జన్మవృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక నమూనాలతో అలంకరించారు.
ప్రభువు రాకకోసం..
క్రీస్తును నమ్మిన వారికి ఇదొక శుభదినం. ప్రభువు రాకకోసం క్రిస్మస్‌కు నెల రోజుల ముందు నుంచే క్రీస్తు విశ్వాసులు సమాయత్తం అవుతారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన చర్చిలతో పాటు ఆయా కాలనీల్లో అర్ధరాత్రి ఏసు ప్రభువు రాకను పురస్కరించుకుని ప్రార్థనలు చేసి కేక్‌లను కట్ చేస్తారు. ఉదయం వందలాది మంది సేవకులు ప్రార్థనా మందిరాలకు చేరుకుని దేవుడిని ఆరాధిస్తారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అలాగే దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు హైస్కూల్‌లో బ్రదర్ జేసురాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏసు జనన పాక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment