కార్మిక రాజ్యస్థాపనకు పాటుపడాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి
జనగామ రూరల్: దేశంలో కార్మిక రాజ్యస్థాపనకు యువత, విద్యార్థులు, మేధావులు, నాయకులు పాటుపడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి అన్నారు. మంగళవారం గబ్బెట గోపాల్ రెడ్డి భవన్‌లో చొప్పరి సోమయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశంలో రాజారెడ్డి పాల్గొని మాట్లాడారు. శ్రమజీవుల రక్తంతో ఉద్భవించింది ఎర్రజెండా పార్టీ అన్నారు. నేటి యువత, విద్యార్థులు, మేధావులు, శ్రామిక వర్గ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి, మనదేశంలో కార్మిక, కర్షక, శ్రమ జీవుల రాజ్య స్థాపనకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పాతురు సుగుణమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు రావుల సదానందం, జువారి రమేష్, నీల కనకయ్య పాల్గొన్నారు.
అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి
జనగామ రూరల్: కేంద్ర మంత్రి అమిత్‌షా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఎస్పీ నాయకులు నీర్మాల రత్నం డిమాండ్ చేశారు. మంగళశారం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మడిపడిగ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ గురించి అవహేళనగా మాట్లాడిన మాటలు బాధాకరమన్నారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో రాపాక శ్రీశైలం, జెరిపోతుల మల్లయ్య, అర్జున్, జలగం ప్రవీణ్, ప్రసాద్, సిద్దులు, అఖిల్, కుమారస్వామి, గణేష్, రాజు, భాస్కర్, జోగు శివ నవనీత, లావణ్య, శ్రీకాంత్, నవీన్, ప్రసాద్ పాల్గొన్నారు.
జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రానికి చెందిన పొన్న రవి, రమాదేవి దంపతుల కుమార్తె పొన్న వైష్ణవి జాతీయస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీవీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి రాష్ట్రం నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు ముంబైలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కాగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న వైష్ణవిని పలువురు అభినందించారు.
రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలకు..
జనగామ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరుగనున్న రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలకు రాష్ట్రం తరఫున ఆడేందుకు జనగామకు చెందిన తాటి నిహారిక మంగళవారం బయలు దేరి వెళ్లారు. ఈ మేరకు సహచర టీం సభ్యులతో పాటు నిహారికకు పలువురు క్రీడాకారులు వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఘన స్వాగతం పలికారు. విజయంతో తిరిగి రావాలని కోరారు.
బహుమతులు అందజేత
జనగామ రూరల్: క్రిస్మస్ పండుగ సందర్భంగా మంగళవారం ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో విద్యార్థులు, ప్రయాణికులకు ఆర్టీసీపై పలు ప్రశ్నలతో క్విజ్ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం డిపో మేనేజర్ ఎస్.స్వాతి క్రిస్మస్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డి.హుస్సేన్, అసిస్టెంట్ మేనేజర్(ట్రాఫిక్) వై. యాదమణి రావు, ఆఫీస్ సూపరింటెండెంట్ ఎం. సమ్మయ్య, వి. ప్రభాకర్, ఎం.ఎస్. రాజు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్‌కు రెండు రోజులు సెలవు
జనగామ: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని జనగామ వ్యవసాయ మార్కెట్‌తో పాటు సీసీఐ సెంటర్లకు రెండు రోజులు పాటు సెలవులను ప్రకటించడం జరిగిందని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే సందర్భంగా సెలవు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో మార్కెట్‌లో రెండు రోజుల పాటు క్రయ, విక్రయాలు జరగవన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి పంట ఉత్పత్తులు, సీసీఐ కేంద్రాలకు పత్తిని తీసుకు వెళ్లవద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment