శిథిలావస్థలో పీఏసీఎస్ భవనం
జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సొసైటీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవన నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు నూతన భవనం మంజూరు కాలేదు. చేసేది ఏమిలేక ఇబ్బందుల నడుమ సిబ్బంది అందులోనే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. దీంతో ఎప్పుడు భవనం కూలి ఏ ప్రమాదం జరుగుతుందోనని కార్యాలయ సిబ్బంది, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సొసైటీ పరిధిలో 5,900 మంది రైతులు
గత కొన్నేళ్ల క్రితం మండలంలోని జఫర్‌గఢ్, కూనూర్, తమ్మడపల్లి (ఐ) గ్రామాల్లో ప్రభుత్వం సహకార సొసైటీలను ఏర్పాటు చేయడంతో పాటు అప్పట్లోనే పక్కా భవనాలను నిర్మించారు. అనంతరం ప్రభుత్వం తమ్మడపల్లి (ఐ), కూనూర్ సొసైటీలను తొలిగించి మండల కేంద్రంలో ఉన్న జఫర్‌గఢ్ సహకార సొసైటీ కిందికి వాటిని తీసుకొచ్చి ఒకే సొసైటీగా ఏర్పాటు చేసింది. ఈ సొసైటీ పరిధిలో ప్రస్తుతం 5,900 మంది రైతులు ఉన్నారు. ఇందులో 1,200 మంది రైతులు వివిధ రకాల పంట రుణాలు పొందారు. వీటితో పాటు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పలు గ్రామాల్లో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశారు. పంటల సాగుకు కావాల్సిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరాఫరా చేస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్న సిబ్బంది, రైతులు
ఎన్నో ఏళ్ల కింద నిర్మించిన సొసైటీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం పైపెచ్చులు ఊడిపడి పగళ్లు ఏర్పడ్డాయి. వర్షం వస్తే భవనం ఎదుట పెద్ద చెరువులా మారడంతోపాటు నీరు కార్యాలయంలోకి రావడంతో సిబ్బంది, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. భవనం ఎప్పుడు కూలి ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వానికి రూ. 2 కోట్లతో ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటి వరకు మంజూరుకు నోచుకోలేదు. ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం నూతన భవనాన్ని త్వరలో మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే కొత్త భవనాన్ని మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఎప్పుడు కూలుతుందోనని ఆందోళనలో సిబ్బంది
నూతన భవనాన్ని మంజూరు చేయాలని స్థానికుల విజ్ఞప్తి
ప్రతిపాదనలు పంపాం..
ప్రస్తుతం సొసైటీ భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకుంది. నూతన భవనం నిర్మాణం కోసం రూ. 2 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. భవనం నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సహకారంతో త్వరలో నూతన భవనం మంజూరు కానుంది.
– తీగల కర్ణాకర్‌రావు, సొసైటీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment