నేడు 3కే రన్
జనగామ రూరల్: డ్రగ్స్‌పై అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణకు వాక్, 3కే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏసీపీ పార్థసారథి, సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. శనివా రం బతుకమ్మకుంట వద్ద వాకర్స్, యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ నేడు (ఆదివారం) ఉదయం 6 గంటలకు వాక్, 3కే రన్ ప్రారంభమవుతుందని, పట్టణ ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
గృహ నిర్మాణ శాఖ పీడీగా మత్రునాయక్
జనగామ: జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ)గా ఏ.మత్రునాయక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న మత్రునాయక్ పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న పీడీ దామోదర్‌రావు సిద్దిపేటకు బదిలీపై వెళ్లారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పీడీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
మెరుగైన సేవలందించాలి
జనగామ రూరల్: జాతీయ ఆరోగ్య సూచనలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున రావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓతో కలిసి మెడికల్ ప్రోగ్రాం ఆఫీసర్లు, ఎంహెచ్‌ఎల్పీలతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ అన్ని పీహెచ్‌సీ సెంటర్‌లతో వందశాతం ఇమ్యూనైజేషన్ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చేలా పనితీరును మెరుపర్చుకోవాలని పీహెచ్‌సీ సెంటర్ల ఇన్‌చార్జ్‌లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పీహెచ్‌సీ డాక్టర్లు, ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మోకాళ్లపై నిల్చొని నిరసన
జనగామ రూరల్: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మోకాళ్లపై నిల్చొని వినూత్న నిరసన తెలిపారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 19వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లచీరలు, దుస్తులు ధరించి మోకాళ్లపై నిలబడి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాడురూ రమేశ్ మాట్లాడారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దయాకర్, జిల్లా బాధ్యులు గోరంట్ల యాదగిరి, వెంకటేశ్వర్లు, నరేష్, అన్నపూర్ణ, మహాలక్ష్మి, ప్రశాంతి, రమ్య సుకన్య, నవీన, రాజు, రాజకుమార్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
1098 ఆకారంలో విద్యార్థినులు
జనగామ రూరల్: మహిళా సాధికారత కేంద్రం, సఖీ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం చౌడారం కేజీబీవీ బాలికలు వినూత్నంగా అవగాహన కల్పించారు. బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాలు అరికట్టడానికి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 ఆకారంలో కూర్చుని అవగాహన కల్పించారు. అలాగే మహిళలు హింసకు గురయితే మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181కు కాల్ చేసి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో జెండర్ స్పెషలిస్ట్ పవిత్ర, హేమలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పిచ్చికుక్క దాడిలో
ఇద్దరికి గాయాలు
నర్మెట: పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నర్మెట మండలం వెల్దండలో శనివారం చోటు చేసుకుంది. డబుల్ బెడ్‌రూం కాలనీవాసులైన బోదాసు సత్యలక్ష్మి ఇంటి ముందు పనుల్లో నిమగ్నమై ఉండగా పిచ్చికుక్కు ఆమె మోచేతిని గాయపరిచింది. ఆమె అరవడంతో వదిలి కొద్ది దూరంలో ఆడుకుంటున్న బాలుడు గోల్కొండ రిషిపై దాడి చేసి ముఖంపై తీవ్రంగా గాయపరిచింది. వెంటనే కాలనీవాసులు వారిద్దరిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment