సౌత్ ఆఫ్రికాలో రంగాపురం వాసి మృతి
కొడకండ్ల: ఆరు నెలల క్రితం ఉపాధి కోసం సౌత్ ఆఫ్రికా దేశానికి వలస వెళ్లిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా.. మృతదేహం కోసం ఐదురోజులుగా కన్నీరుమున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన గొడుగు శ్రీనివాస్ (52) ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం సౌత్ ఆఫ్రికాలోని కాంగో లుబమాస్ నగరానికి వలస వెళ్లి డీఆర్‌సీ పాలిమర్స్ ఎస్‌ఏఆర్‌ఎల్ పీవీసీ పైప్‌ల కంపెనీలో చేరాడు. ఈ నెల 25న శ్రీనివాస్ మృతి చెందినట్లు సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఆరోగ్యంగా వెళ్లిన వ్యక్తి ఆకస్మాత్తుగా ఎలా మృతి చెందాడనే విషయంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీనివాస్ చనిపోయిన సమాచారం అందుకున్నప్పటి నుంచి కుటుంబసభ్యులంతా ఐదు రోజులుగా మృతదేహం ఎప్పుడొస్తుందో కూడా తెలియని దుస్థితిలో రోదిస్తున్నారు. కంపెనీ వారితో మాట్లాడితే మృతదేహాన్ని తీసుకొస్తామంటున్నారే తప్ప.. ఎప్పుడు మృతదేహం వస్తుందో తెలియని ఆయోమయ పరిస్థితిలో కుటుంబసభ్యులు ఉన్నారు. శ్రీనివాస్ గతంలో దుబాయ్‌కి వెళ్లి పీవీసీ పైపుల కంపెనీలో చాలా కాలం పనిచేయగా గ్రామస్తులు అప్యాయంగా అతడిని దుబాయ్ శ్రీనుగా పిలిచేవారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు భార్య సుశీల, కుమారుడు ప్రసన్నకుమార్, కుమార్తె శ్రావణిలు ఉన్నారు.
ఐదురోజులుగా మృతదేహం కోసం కుటుంబసభ్యుల నిరీక్షణ
Comments
Please login to add a commentAdd a comment