‘పది’ ఫలితాలపై ప్రత్యేక దృష్టి
● జనవరి చివరి కల్లా ఇందిరమ్మ ఇళ్ల జాబితా
● సాక్షి ఇంటర్వ్యూలో కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ: నూతన సంవత్సరంలో పదవ తరగతి వార్షిక ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. రాష్ట్రంలోనే మంచి ర్యాంకు సాధించే దిశగా అడుగులు వేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని సాక్షి ఇంటర్వ్యూలో కలెక్టర్ మాట్లాడారు. పది విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు విజయోస్తు ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టామని, కొత్త సంవత్సరంలో స్పెషల్ తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న భోజన పథకంపై పర్యవేక్షణ పెంచడంతో పాటు భోజనం నాణ్యత విషయంలో ఖచ్చితత్వంతో ఉంటాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే అర్హుల ఇళ్లకు సంబంధించి గ్రౌండింగ్ పూర్తి చేసుకుని, పంచాయతీ ఎన్నికల ముందుగానే బేస్ మెంట్ వరకు ఇళ్ల నిర్మాణ పనులు జరిగేలా పక్కా ప్రణాళికతో ముందుకు వె ళ్తాం. కొత్త పింఛన్లు, రైతు భరోసాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, గైడ్‌లైన్స్ రాగానే, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపై కసరత్తు చేస్తాం. ప్రభుత్వం సంకల్పించిన విధంగా భూ భారతిని నిబంధనల మేరకు అమలు చేస్తామన్నారు.
ఆర్టీసీ ఉత్తములకు సత్కారం
జనగామ: జనగామ ఆర్టీసీలో అంకితభావంతో పని చేస్తూ సంస్థకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన ఉద్యోగులను మంగళవారం డిపో ఆవరణలో మేనేజర్ ఎస్.స్వాతి సత్కరించారు. నవంబర్–2024 మాసంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 23 మంది కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్ విభాగంలో పని చేస్తున్న వారికి ప్రగతి చక్ర అవార్డులను అందించారు. అలాగే డిపో పరిధిలో (నవంబర్–2024) ఆరుగురు కండక్టర్లు, ముగ్గురు టిమ్ డ్రైవర్లు, ఇందన పొదుపు చేసిన ముగ్గురు డ్రైవర్లకు డిపో మేనేజర్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహంతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, అవార్డు గ్రహీతలు, ఆఫీస్ సిబ్బంది, గ్యారేజ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment