జనగామ: భారత ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి గాను నిర్వహించ తలపెట్టిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్(ఏఐసీఎస్) టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఆహ్వానం పలుకుందని జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకట్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రస్థాయి సివిల్ సర్వీస్ సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా వివిధ క్రీడాపోటీలకు సంబంధించి ఈ నెల 23, 24వ తేదీలలో హైదరాబాద్‌లోని పలు క్రీడా మైదానాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారమ్, హాకీ, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ (మహిళలు, పురుషులు)లో అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. అలాగే కుస్తీ–గ్రీకో రోమన్, ఉత్తమ శరీర ధృఢత్వం, ఖోఖో, యోగా అంశాలలో సైతం పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగులు సర్వీస్ సర్టిఫికెట్, ఇటీవల తీసుకున్న గుర్తింపు కార్డుతో ఈ నెల 21వ తేదీన కలెక్టరేట్‌లోని రెండో అంతస్తు ఎస్–15లోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సాయంత్రం 4గంటల వరకు వచ్చి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో పేర్లు నమోదు చేసుకున్న ఉద్యోగులను మా త్రమే పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment