‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి’
జఫర్‌గఢ్: కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్ర ఉప్పలయ్య, సంఘం ప్రధాన కార్యదర్శి బాల్నే వెంకటమల్లయ్య డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఉప్పుగల్లులో శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద కల్లుగీత కార్మికులతో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షులు కొరుకోప్పుల రాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి 5లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. వీరిని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. 2024 అక్టోబర్ 18న నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో 22 డిమాండ్లు రూపొందించి ప్రభుత్వానికి అందజేసినా ఇప్పటి వరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కేవలం అరకొరగా సేఫ్టీ కిట్టును ప్రభుత్వం అందిస్తున్నదే తప్పా మిగితా హామీల అమలు విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఈ నెల 20న కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నాలో కల్లుగీత కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు నాయిని యాదగిరి, సంఘం మండల అధ్యక్షులు గడ్డం రాజు, సంఘం ఉపాధ్యక్షుడు పులి ధనుంజయ, మూల సారయ్య, బొల్లపల్లి రాజు, వడ్లకొండ మధుకర్, పూజారి యాకయ్య, గడ్డం రమేష్, బైరు రాజు, దొరి నవీన్‌కుమార్‌తో పాటు గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment