నిలదీతలు.. నిరసనలు
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించిన గ్రామసభలు రసాభాసగా మారాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 90 గ్రామాల్లో ఉదయం 9 గంటలకు గ్రామసభలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం పట్టణ, పల్లె బాట పట్టారు. గ్రామసభలు ప్రారంభం కాగానే.. అధికారులు నాలుగు పథకాలకు సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాను చదివి వినిపించడంతో ఒక్కసారిగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. జాబితాలో అనర్హులకు పెద్దపీట వేశారని మండిపడ్డారు. పోలీసులు కలుగజేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
కలెక్టర్‌ను ప్రశ్నించిన గ్రామస్తులు..
జనగామ మండలం శామీర్‌పేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ బాషాను పలువురు ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇతర పథకాలు వచ్చినోళ్లకే వస్తున్నాయి... మా సంగతేంటని ఓ వ్యక్తి కలెక్టర్ నిలదీయగా, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అలాగే అడవికేశ్వాపూర్, పెంబర్తి, యశ్వంతాపూర్, పెద్దపహాడ్, తదితర గ్రామాల్లో 70శాతానికి పైగా అనర్హులకే పథకాలను వర్తింప జేస్తున్నారని, పేదలను విస్మరించారని గ్రామసభలో అధికారులను నిలదీశారు. పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలో రూ.2లక్షల రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో జరిగిన గ్రామసభలో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని 7 గ్రామాల్లో చిన్న పాటి గొడవలు మినహా సాపీగా సాగాయి. వంగాలపల్లి గ్రామంలో జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి వినయ్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జఫర్‌గఢ్ మండల కేంద్రంలో జరిగిన గ్రామసభకు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ హాజరు కాగా, జాబితాలో తమ పేర్లు కనిపించడం లేదంటూ మండిపడ్డారు. రఘునాథపల్లి మండలంలోని 12 గ్రామాల్లో జరిగిన సభకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక గ్రామాల్లో అధికారులను ప్రజలు నిలదీశారు.
తొలిరోజు గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు
గ్రామసభలు : 90
రేషన్‌కార్డుల దరఖాస్తులు: 3,599
ఇందిరమ్మ ఇళ్లకు: 3,509
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: 1,529
రైతు భరోసా : 116
మొత్తం : 8,753
జిల్లాలో గందరగోళంగా గ్రామసభలు
ఆందోళనలో జాబితాలో పేర్లు రానివారు
ఇది నిరంతర ప్రక్రియ
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి
గ్రామసభల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment