పోవుడే.. వచ్చుడు లేదు
జనగామ: ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీలు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లా నుంచి 55 మంది మ్యూచువల్ బదిలీకి హనుమకొండకు ఆప్షన్ ఇచ్చుకోగా.. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక్కరు కూడా ఆప్షన్ పెట్టుకోలేదు. అందరికీ ట్రాన్స్‌ఫర్ రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వగా.. నేడు వెళ్లిపోనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చింది. స్పౌజ్(భార్యాభర్తలు ఒకేచోట పని చేసే అవకాశం)తో పాటు మ్యూచువల్ బదిలీలకు సంబంధించిన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అప్ప టి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో విడుదల చేసిన 317 జీఓతో స్థానికతను కోల్పోయామని ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. జీఓలో సడలింపు ఇవ్వాలని నాటి సర్కారుకు వినతులు సమర్పించగా 2022 సంవత్సరంలో మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించారు. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని వారు అక్కడే ఉండి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అధికారంలోకి వచ్చిన వెంట నే 317 జీఓ నిబంధనలను పరిశీలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పౌజ్, మ్యూచువల్ బదిలీలపై మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యాన చర్చించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి బదిలీల ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టింది.
55 మంది మ్యూచువల్.. 62 మంది స్పౌజ్
జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయలకు సంబంధించి స్పౌజ్ కేటగిరీలో 62, మ్యూచువల్ బదిలీలకు సంబంధించి 55 మంది ఉన్నారు. ఉద్యోగులు(స్పౌజ్–7, మ్యూచువల్–4), ఉపాధ్యాయులు(స్పౌజ్–55, మ్యూచువల్–51) బదిలీల కోసం ఆప్షన్ ఇవ్వగా.. స్పౌజ్‌కు సంబంధించి రిలీవింగ్ ఆర్డర్లు ఇచ్చారు. జిల్లా నుంచి మ్యూచువల్ కోసం 55 మంది ఉపాధ్యాయులు హనుమకొండకు ఆప్షన్ ఇవ్వగా.. అక్కడి నుంచి రావడానికి ఒక్కరు కూడా ఆప్షన్ ఇచ్చుకోలేదు. దీంతో జిల్లాలోని ఎస్జీటీ కేటగిరీలో 43, గణితం(ఎస్‌ఏ, తెలుగు మీడియం)–2, ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎస్‌ఏ, తెలుగు మీడియం)–2, ఇంగ్లిష్–2(ఎస్‌ఏ), ఎస్జీటీ ఉర్దూ–2, స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) విభాగంలో బయోసైన్స్, తెలు గు, ఫిజికల్ సైన్స్, ఎస్జీటీ తెలుగు ఒకరి చొప్పున బదిలీకి రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వగా.. డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతోంది.
చివరి దశకు ఉపాధ్యాయ,
ఉద్యోగుల బదిలీలు
జిల్లాలో 391 ఉపాధ్యాయ ఖాళీలు
డీఎస్సీ తర్వాతే భర్తీకి నిర్ణయం
స్పౌజ్ బదిలీలతో 391 ఖాళీలు
ప్రస్తుత ఉపాధ్యాయ స్పౌజ్ బదిలీలతో 391 ఖాళీలు ఏర్పడగా ఇందులో ఎస్జీటీలు 208, లాంగ్వేజ్ పండిట్లు 3, పీఎస్ హెచ్‌ఎం 9, గెజిటెడ్ హెచ్‌ఎం 13, బయోలాజికల్ సైన్స్ 15, ఇంగ్లిష్ 4, ఎస్‌ఏ హిందీ 12, ఎస్‌ఏ గణితం 8, ఫిజికల్ డైరెక్టర్లు 4, ఫిజికల్ సైన్స్ 2, ఎస్‌ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ 15, ఎస్‌ఏ సాంఘిక 13, ఎస్‌ఏ తెలుగు 15, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ 12, ఉర్దూ 3 ఖాళీలు ఉండగా.. పదోన్నతులు కల్పించి మిగతా పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment