అభివృద్ధి చేయలేకపోయాం
జనగామ: ‘వార్డులను అభివృద్ధి చేయలేకపోయాం. బాధగా ఉంది. భవిష్యత్‌లో పట్టణం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లను క్షమించాలని కోరుతున్నాం’ అని జనగామ పురపాలిక పాలక మండలి చివరి సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం ము న్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమునలింగయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలపై చర్చ లేకుండానే ముగిసింది. ఐదేళ్ల కాలంలో ఏ పనులు చేశామని సన్మానాలు చేస్తున్నారు? ఎజెండా అంశాలను మెజార్టీ సభ్యులు అంగీకారం లేకుండా తీర్మానించుకున్నారు... కౌన్సిల్ పూర్తిగా విఫలమైంది అంటూ ఆగ్రహం వెల్లగక్కారు.
కుంటుపడిన అభివృద్ధి!
బీజేపీ ఫ్లోర్ లీడర్ మహంకాళి హరిశ్చంద్రగుప్త మాట్లాడుతూ.. ఐదేళ్ల తమ పాలకమండలి పాలనలో కమిషనుర్లు, ఆయా శాఖల అధికారులు, సెక్షన్ డిపార్ట్‌మెంట్లలో పని చేసే ఉద్యోగుల బదిలీలతో అభివృద్ధి, పాలన పూర్తిగా కుంటుపడి పోయిందన్నారు. పాలక ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకు రావడంలో అధికారులు, గత ప్రజాప్రతినిధులు విఫలం కావడంలో పట్టణంలో అనుకున్న మేర అభివృద్ధి చేయలేకపోయామన్నారు.
చర్చను అడ్డుకోవడం సిగ్గు చేటు..
17వ వార్డు కౌన్సిలర్ జక్కుల అనిత వేణుమాధవ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు ఏం చేశారని సత్కరించారని, తాము ప్రజలకు ఏం జవాబు చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. సర్వసభ్య సమావేశాల పేరిట కాలయాపన మినహా, చర్చ లేకుండానే ఎజెండా అంశాలను తీర్మానించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల సమయంలో ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయామన్నారు. చివరి సమావేశంలో సైతం చర్చను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. రూ.9 లక్షల జనరల్ ఫండ్‌ను సాధారణ పద్దు కింద మార్చి ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. చివరి సమావేశం పేరిట ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును పూర్తిగా కడిగేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు సేవ చేయలేని సమయంలో సత్కారాలు అవసరం లేదని తిరస్కరించినట్లు చెప్పారు. పదవీ కాలంలో సంతృప్తిగా లేము.. వార్డు ప్రజలు క్షమించాలంటూ తన ప్రసంగాన్ని ముగించారు. మహిళా సభ్యులు గుర్రం భూలక్ష్మి నాగరాజు, బండ పద్మయాదగిరిరెడ్డి, ఉడుగులు శ్రీలత, తాళ్ల సురేశ్‌రెడ్డి, గాదెపాక రాంచందర్, పేర్ని స్వరూప మాట్లాడుతూ.. వార్డుల పరిధిలో అనుకున్న మేర అభివృద్ధి చేయలేకపోయామని, భవిష్యత్‌లో పట్టణం మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 14 ఎజెండా, 8 టేబుల్ అంశాలను కౌన్సిల్ ముందుకు తీసుకు రాగా ఆమోదించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, మేనేజర్ రాములు, మల్లిగారి మధు తదితరులు ఉన్నారు.
ప్రజాసేవలో భాగస్వాములు కావాలి: పల్లా
పదవీకాలం ముగిసినా ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పురపాలిక పాలక మండలికి సూచించారు. శుక్రవారం మున్సిపల్‌లో జరిగిన పాలక మండలి వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులను సత్కరించి మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో పట్టణ ప్రజలకు సేవ చేసిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవలో నిరంతరం పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో ప్రజాసేవలో ఉంటూ మరెన్నో పదవులు సాధించాలని ఆకాంక్షించారు.
ఓట్లేసిన ప్రజలు క్షమించాలి:
పాలక మండలి సభ్యులు
చివరి సమావేశంలో ఊసే లేని చర్చ
సాధారణ పద్దు కింద జనరల్ ఫండ్!
భావోద్వేగాలతో ముగిసిన కౌన్సిల్ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment