గ్రామసభలకు దరఖాస్తుల వెల్లువ
జనగామ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నూతన పథకాల అర్హుల ఎంపిక కోసం నాలుగు రోజులుగా జిల్లాలో కొనసాగుతున్న గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. జాబితా లో పేర్లు గల్లంతవడంతో జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల్లో అధికారులను నిలదీశారు. ఇదే విషయమై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. కొన్ని చోట్ల తన్నుకోగా.. మరికొన్ని గ్రామాల్లో దూషణల పర్వం కొనసాగింది. చివరి రోజు సైతం జిల్లాలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు పథకాలకు సంబంధించి కొత్తగా 34,531 దరఖాస్తులు వచ్చాయి. ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామ సభల్లో పోలీసులు కీలక పాత్ర పోషించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ నేతృత్వంలో ఏసీపీ, సీఐ, ఎ స్సై, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తూ.. అర్జీదారులు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు నచ్చజెబుతూ గొడవలు జరగకుండా చూసుకున్నారు. చిన్న చిన్న గొడవలు మినహా.. తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా గ్రామ సభలు ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందించనున్నారు.
జిల్లాలో ఇలా..
కొత్తగా 34,531 దరఖాస్తులు
నిరసనల నడుమ ముగిసిన సభలు
ఊపిరి పీల్చుకున్న అధికారులు
గ్రామ సభలు: 283
మున్సిపల్ వార్డులు: 30
రేషన్ కార్డుల దరఖాస్తులు: 14,532
ఇందిరమ్మ ఇళ్లు: 13,955
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: 5,270
రైతుభరోసా: 491
మొత్తం 34,531
Comments
Please login to add a commentAdd a comment