ఐదేళ్లు.. రూ.36కోట్ల ఖర్చు!
జనగామ: జనగామ మున్సిపల్ పాలక మండలి పదవీ కాలం ఆదివారం అర్ధరాత్రితో ముగియనుంది. సోమవారం నుంచి పురపాలికలో స్పెషల్ అధికారి పాలన పట్టా లెక్కనుంది. 2020 జనవరి 25న ఎన్నికల ఫలితాలు వెలువడగా 27న పురపాలిక పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది. పట్టణ పరిధి వార్డుల్లో కనీస మౌలిక వసతి సౌకర్యాలు కల్పించలేని దయనీయస్థితిలో ప్రస్తుత పాలక మండలి దిగిపోనుంది. అస్తవ్యస్తంగా మారిన ‘పురపాలిక’ స్పెషల్ అధికారి పాలనలలో గాడిన పడుతుందా.. లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ ఐదేళ్ల పాలక మండలి హయాంలో 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్ అన్నీ కలుపుకుని సుమారు రూ.40కోట్ల మేర బడ్జెట్ రాగా.. పలు అభివృద్ధి పనులు, సిబ్బంది వేతనాలు తదితరాలకు రూ.36 కోట్ల మేర ఖర్చు చేశారు. ఇంటి, నల్లా, తదితర కమర్షియల్ పన్నుల రూపంలో 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.5.71 కోట్ల మేర డిమాండ్ ఉండగా, ఇప్పటి వరకు 1.77(31.03 శాతం)కోట్లు వసూలయ్యాయి. మార్చి 31 వరకు వందశాతం వసూలు లక్ష్యంగా పని చేస్తున్నారు. 2019–20లో 96.92శాతం, 2020–21లో 80.56శాతం, 2021–22లో 72.72శాతం, 2022–23లో 65.75శాతం, 2023–24లో 71.71 శాతం పన్నులు వసూలు చేశారు. పురపాలికలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఇంజనీరింగ్ ఇతర శాఖల పరిధిలో కమిషనర్ల పర్యవేక్షణ కొరవవడంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఇంటి అనుమతుల కోసం కమిషనర్ చెప్పినా.. అనుమతులు దొరకని పరిస్థితి నెలకొనడంపై జోరుగా చర్చ జరుగుతోంది. మధ్య వర్తుల పెత్తనంతో కమీషన్ల దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పెషల్ ఆఫీసర్ పాలనలోనైనా పట్టణానికి మంచి రోజులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు.
నేటితో ముగియనున్న మున్సిపల్
పాలక మండలికి గడువు
రేపటి నుంచి స్పెషల్ అధికారి పాలన
Comments
Please login to add a commentAdd a comment