టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
కాటారం మండలం చింతకాని ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు
● ప్రతీ రోజు సాయంత్రం వేళలో నిర్వహణ ● 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉండే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు పది రోజుల నుంచి సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లోని 157 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో సుమారు 3,513 మంది విద్యార్థులు పదో తరగతి విద్యనభ్యసిస్తున్నారు. ప్రత్యేక తరగతుల కార్యాచరణ ప్రణాళికలను జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తయారు చేసి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు చదువులో వెనుకబడిపోయారు. సబ్జెక్టులపై పట్టుకోల్పోయారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చదువులో వె వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ప్రతీ విద్యార్థి పాసై వందశాతం ఉత్తీర్ణత సాధించాలని గంటపాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు సూచనలు ఇస్తూ వారి అనుమానాలను నివృత్తి చేస్తూ చదువులో ముందుండేలా ప్రోత్సహిస్తున్నారు. రోజు వారీగా ఒక్కో సబ్జెక్ట్‌పై స్లిప్‌టెస్టులు నిర్వహిస్తున్నారు.
ప్రతి రోజూ అదనంగా గంట..
ప్రత్యేక కార్యాచరణ ఇదే..
డిసెంబర్ 31వ తేదీ వరకు విద్యార్థులకు సెలబస్ పూర్తి చేయాలి
ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయంలో సంబంధిత ఉపాధ్యాయుడికి సెలవు మంజూరు చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి.
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రతి అధ్యాయం పున:శ్చరణ చేయాలి.
పరీక్షా మార్గదర్శకాలకు అనుగణంగా పాఠశాల స్థాయిలో పరీక్షా పత్రాలను తయారు చేయాలి
షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు స్లిప్ టెస్టులు నిర్వహించాలి
చదువులో వెనుకబడిన పిల్లలకు సవరణాత్మక బోధన చేయాలి
వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయులు దత్తత చేసుకోవాలి
తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల సామర్థ్యాలను తెలియజేయాలి.
ప్రతి రోజూ సాయంత్రం 4.15గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహణను మండల విద్యాశాఖ అధికారులు, సెక్టోరియల్ అధికారులు పర్యవేక్షణ చేసి ప్రగతిని డీఈఓకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా విద్యార్థుల సామర్థ్యాలను అందజేయాల్సి ఉంటుంది. ప్రతీ రోజూ పాఠాల బోధనతోపాటు స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment