పకడ్బందీగా గ్రూప్–3 పరీక్ష
భూపాలపల్లి: గ్రూప్ 3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష నిర్వహణలో రూటు అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ల విధులు అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పరీక్ష నిర్వహణకు విధులు కేటాయించిన డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్, ఐడెంటిఫికేషన్ అధికారులతో గురువారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విధులు కేటాయించిన సిబ్బంది ఉదయం ఏడు గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3,707 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరువుతున్నట్లు తెలిపారు. 17మంది పరిశీలకులు, 34మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఒక బయోమెట్రిక్ సూపర్‌వైజర్‌ను నియమించామన్నారు. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ పోలీస్ ఎస్కార్ట్ భద్రతతో తరలించడానికి క్లోజ్డ్ వాహనాల ఏర్పాటుతో పాటు ఐదుగురు రూటు అధికారులను నియమించామని తెలిపారు. 14 మంది దివ్యాంగ అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని వారికి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారిని స్క్రైబ్స్‌గా నియమించనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక గదిని కేటాయించాలని, వారికి అదనంగా 50 నిమిషాలు సమయం ఇవ్వాల్సి ఉందన్నారు. పరీక్ష పూర్తి అయ్యేవరకు అభ్యర్థులను బయటకు పంపొద్దని ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని సూచించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రశాంత వాతావరణం కోసం అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రం పరిసరాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూసేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరీక్ష జిల్లా నోడల్ అధికారి విజయలక్ష్మి, పోలీస్ నోడల్ అధికారి బోనాల కిషన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం రవాణాలో జాప్యం వద్దు
కలెక్టర్ రాహుల్ శర్మ
ధాన్యం రవాణాపై సమీక్ష..
కొనుగోలు చేసిన ధాన్యం రవాణాలో జాప్యం చేయొద్దని కలెక్టర్ రాహుల్ శర్మ ట్రాన్స్‌పోర్టర్లును ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, సహకార, పౌర సరఫరాలు, డీఆర్‌డీఏ, మార్కెటింగ్, రవాణాశాఖ అధికారులు, ట్రాన్స్‌పోర్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, రవాణా తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సరైన తేమ శాతంతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల లోపు ట్యాగ్ చేసిన మిల్లుకు రవాణా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు ధాన్యాన్ని విక్రయించిన 48గంటల్లో బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కావాలని, అందుకు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఏఓ విజయభాస్కర్, పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డీఎం రాములు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment