అటవీశాఖలో కలకలం
భూపాలపల్లి: ‘వేటగాళ్లకు వేటగాడు’ పేరిట శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. అటవీ అధికారులు ఆఘమేఘాల మీద ఉదయం నుంచే విచారణ చేపట్టగా, బీట్ ఆఫీసర్ ఎవరనే విషయమై పోలీసు నిఘా, రెవెన్యూ వర్గాలు సైతం ఆరా తీస్తున్నాయి.
కొనసాగుతున్న విచారణ..
జిల్లాలోని దూదేకులపల్లి రేంజ్ పరిధిలో దుప్పి మాంసం తీసుకెళ్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తుల నుంచి రూ.లక్ష తీసుకున్న బీట్ ఆఫీసర్ ఎవరనే విషయమై అటవీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. డీఎఫ్‌ఓ ఎం.నవీన్‌రెడ్డి ఆదేశాల మేరకు దూదేకులపల్లి రేంజ్ ఆఫీసర్ రామ్మూర్తి శుక్రవారం ఉదయమే రేంజ్‌కు చేరుకొని సిబ్బందిని విడివిడిగా ప్రశ్నించడమే కాక వేటగాళ్ల గ్రామాల్లో సైతం సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. బీట్ ఆఫీసర్ ఎవరనేది కొంత మేరకు తెలిసినప్పటికీ ఆధారాల కోసం అధికారులు వేచిచూస్తున్నట్లు సమాచారం.
కప్పి పుచ్చేందుకు యత్నం..
వేటగాళ్ల నుంచి రూ.లక్ష తీసుకున్న సదరు బీట్ ఆఫీసర్ ఏమీ ఎరుగనట్లుగానే శుక్రవారం అందరితో పాటు ఉంటూ... ఆ పని ఎవరు చేశారని తోటి వారిని ప్రశ్నిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. అంతేకాక ఇలా ఎవరికై నా జరుగుతుందని, మనం అందరం కలిసికట్టుగా ఉండాలని, ఏ విచారణ జరిగినా ఏదీ బయటకు రానివ్వొద్దని తోటి బీట్ ఆఫీసర్లకు ఉచిత సలహాలు ఇచ్చినట్లు తెలిసింది.
నిఘా వర్గాల ఆరా..
వన్యప్రాణుల వేట కోసం ఉచ్చులు, విద్యుత్ తీగలు బిగించడం మూలంగా రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక గతేడాది ఫిబ్రవరి 11న రాత్రి కాటారం మండలం నస్తూర్‌పల్లి అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్... వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి పోలీసు అధికారులు సైతం వన్యప్రాణుల వేటను సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దూదేకులపల్లి రేంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసు అధికారులతో పాటు నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో ఆరా తీసినట్లు సమాచారం.
సంచలనం సృష్టించిన
‘వేటగాళ్లకు వేటగాడు’ కథనం
ఉరుకులు పరుగులు తీసిన అధికారులు
తప్పు కప్పి పుచ్చుకునే యత్నంలో
బీట్ ఆఫీసర్
పోలీసు నిఘావర్గాల ఆరా
నివేదిక కోరిన కలెక్టర్ రాహుల్ శర్మ
నివేదిక కోరిన కలెక్టర్..?
‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ రాహుల్ శర్మ స్పందించారు. వన్యప్రాణుల వేటగాళ్ల వద్ద డబ్బులు తీసుకున్న అటవీ అధికారులు ఎవరనే విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికారికి లేఖ రాసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment