సంబరాల సంక్రాంతి
భూపాలపల్లి అర్బన్: సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. హరివిల్లులాంటి రంగవల్లులు, సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలు, డూడూ బసవన్నల విన్యాసాలు, భోగ భాగ్యాలు ఇచ్చే విధంగా మంటలు, గొబ్బెమ్మల పాటలు, సంప్రదాయ ఆటలతో పెద్ద పండగ కొలువు దీరింది. కొత్త కోడళ్లు.. అల్లుళ్లతో చకినాల రుచులు, విందు భోజనాల ఘుమఘుమలతో రంగులు.. ముగ్గులు.. నోములతో ఇళ్లన్నీ సందడిగా మారాయి. జిల్లావ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లో ఇంటి ముంగిళ్లు రంగులతో ఇంద్రధనుస్సును తలపించాయి. చిన్నారులకు తల్లిదండ్రులు భోగి పండ్లను తలపై పోసి దీవించారు. అనుబంధాలు, ఆత్మీయత.. ప్రేమ పూర్వక పలకరింపులతో పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.
ఘనంగా భోగి వేడుకలు
జిల్లావ్యాప్తంగా గ్రామగ్రామాన భోగి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. భోగి పండుగలో భాగంగా మహిళలు ఇంటి ముందు ఉదయాన్నే ముగ్గులు పెట్టి ఆవు పేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు, రేగుపండ్లు, ఇతర గరిక ఆకులు, నవధాన్యాలు, పండ్లతో కలిపి ప్రతిష్టించారు. జిల్లా కేంద్రంలో పలు కాలనీలలో మహిళలు, యువకులు భోగి మంటలు ఏర్పాటు చేసి మంటల చుట్టూ తిరుగుతూ డీజే పాటలతో నృత్యాలు చేశారు. పాత వస్తువులను మంటల్లో వేశారు. మహిళలు తమ ఇండ్లలో కుటుంబ సభ్యులతో కలిపి తీపి, పిండి పదార్థాలను తయారు చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
రైతన్నల పండుగ
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు. దీన్నే రైతన్నల పండుగగా పిలుస్తారు. ఖరీఫ్ పంటలు చేతికి వచ్చే శుభవేళ కూడా ఇదే. ఉదయాన్నే ఆవు పేడతో ఇంటి వాకిట అలుకులు చల్లి.. రంగురంగుల రంగ వల్లికలను తీర్చిదిద్ది సంక్రాంతి లక్ష్మిని మహిళలు సాదరంగా ఆహ్వానిస్తారు. నూతన వస్త్రధారణతో ఆనందంగా గడపడం.. కొత్త అల్లుళ్లు.. ముగ్గుల పోటీలు ఈ పండుగ ప్రత్యేకత.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా సోమవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాకేంద్రమైన శ్రీభక్తాంజనేయస్వామి ఆలయం, కోదండరామాలయం, కాళేశ్వరం, గణపురం కోటగుళ్లు, కోటంచ శ్రీలక్ష్మినర్సింహాస్వామి, నైన్‌పాక గ్రామంలోని నాపాక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు ఆధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
తెల్లవారు జామునే భోగి మంటలు
సందడిగా మారిన ఊరూవాడ
రంగవల్లులతో
వాకిళ్లకు అందాలు
ధాన్యలక్ష్మి గృహ ప్రవేశం..
ఆలయాల్లో పెరిగిన రద్దీ
Comments
Please login to add a commentAdd a comment