కాళేశ్వరం ‘ట్రస్టుబోర్డు’ ఆలస్యం
కాళేశ్వరం: రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కాళేశ్వరం ఒక్కటి. ఒక్కసారైనా ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి చేయాలని ధృఢ సంకల్పం ఇక్కడి నేతల్లో బలంగా ఉంటుంది. చైర్మన్ పదవితో రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు ఉంటుందని వారి భావన. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో మరోసారి మరింత ఆలస్యం కానుంది. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆశావహులు మరికొన్ని రోజులు నిరీక్షించాల్సి ఉంది. మార్చి 3న ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బోర్డు నియామకం జరుగుతుందని తెలిసింది. అప్పటి వరకు ఆశావహులకు ఎదురుచూపులు తప్పేలా లేవు.
రీ నోటిఫికేషన్‌తో..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది ఆగస్టులో ట్రస్టుబోర్డు నియామకానికి దేవాదాయశాఖ నోటిఫికేషన్ వేసింది. అప్పుడు 20 రోజుల నిర్ణీత గడువులోగా 37 దరఖాస్తులు వచ్చాయి. అంతలోనే మూడు నెలల గడువు ముగిసింది. అనివార్య కారణాలతో ఆ ఉత్తర్వులు రద్దు చేశారు. తరువాత జనవరి 5న ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మళ్లీ రీ నోటిఫికేషన్‌ను దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆశావహుకులు 90 వరకు దరఖాస్తులు చేసుకున్నారు.
43ఏళ్ల తరువాత మళ్లీ..
కుంభాభిషేకం నిర్వహణపై అసెంబ్లీలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పలు సమావేశాల్లో మంత్రి శ్రీధర్‌బాబు చర్చించారు. దీంతో దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ ప్రత్యేక శ్రద్దతో కుంభాభిషేకం నిర్వహణకు పూసుకున్నారు. కాళేశ్వరాలయంలో 43ఏళ్ల తరువాత కుంభాభిషేకం వైభవంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తుంది.
ఆశావహులకు నిరాశ
ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ తేదీలకు ముందుగానే ట్రస్టుబోర్డు నియామకం జరుగుతుందని ఆశావహులు ఆశించి నిరాశ పడ్డారు. ఇప్పటికే కాళేశ్వరం దేవాదాయశాఖ అధికారులు కర్ణాటకలోని శృంగేరి పీఠాధిపతి, శృంగేరి అనుబంధ పీఠం రాజమహేంద్రవరంలోని శ్రీసచ్చిదానంద సరస్వతికి కుంభాభిషేకం పూజల నిర్వహణకు రావాలని ఆహ్వానం అందజేశారు. పూజా నిర్వహణకు అచ్చలాపురం వేదపండితులు రానున్నారు. నాలుగు గోపురాలు, మూడు ఆలయాలకు సంప్రోక్షణ చేసి, కలశాలకు అభిషేకం చేయనున్నారు. అదే నెలలో ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు ఉత్సవాలకు ట్రస్టుబోర్డు ఉంటుందని ఆశావహులు ఆనందం వ్యక్తం చేయగా ఎన్నికల కోడ్‌తో చుక్కెదురైందని చర్చ జరుగుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
ఇప్పటికే ఒకసారి వాయిదా..
ఇప్పుడు రెండోసారి..
ఆశావహులకు తప్పని ఎదురుచూపు
మంత్రి చుట్టూ ప్రదక్షిణ..
ఆశావహులు మంత్రి శ్రీధర్‌బాబు చుట్టూ ఆగస్టు నుంచి తిరుగుతున్నారు. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. మళ్లీ నోటిఫికేషన్‌తో ఆశలు చిగురించినా అప్పటి కన్నా 90 వరకు ధరఖాస్తులు ఎక్కువగా రావడంతో ఎవరికి చైర్మన్ పదవి వరిస్తుందని మంథని ప్రజలు ఆలోచనలో పడ్డారు. గతంలో రెండు పర్యాయాలు సిద్దిపేటకు చెందిన కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మెర వెంకటేశంకు ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment