టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్
విద్యారణ్యపురి: ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం పాఠశాల సమయానికి ముందు ఒకగంట, సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక మరో గంట పాటు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం 8 గంటలకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం 5.30 గంటల వరకు ఉండాల్సి వస్తున్నది. ఈ క్రమంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఈవినింగ్‌స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈఓలకు తాజాగా ఆదేశాలు జారీచేశారు.
ఫిబ్రవరి ఒకటి నుంచి స్నాక్స్
స్నాక్స్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు 38 రోజులపాటు అమలు చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున వ్యయం అవుతుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరయ్యాయి. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల అకౌంట్లలోకి వీటిని విడుదల చేయనున్నారు.
ఆరు రకాల స్నాక్స్..!
ఆరు రోజులు ఆరు రకాల స్నాక్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బెర్లు, శనగలు, పల్లీపట్టి, మిల్టెట్ బిస్కెట్స్, ఉల్లిగడ్డ పకోడి అందించాలని నిర్ణయించారు. ఈ స్నాక్స్ కూడా మధ్యాహ్నభోజన ఏజెన్సీల ద్వారానే చేయించి విద్యార్థులకు అందించాలని డీఈఓలకు ఆదేశాలు వచ్చాయి.
జిల్లాల వారీగా పదో తరగతి విద్యార్థుల సంఖ్య, మంజూరైన నిధుల వివరాలు
జిల్లా విద్యార్థులు నిధులు(రూ.ల్లో)
భూపాలపల్లి 1,563 8,96,610
హనుమకొండ 2,834 16,15,380
వరంగల్ 3,474 19,80,180
జనగామ 3,068 17,48,760
మహబూబాబాద్ 3,727 21,81,390
ములుగు 1,076 6,13,320
మొత్తం 15,742 రూ.90,35,640
ఒక్కొక్కరికి రూ.15 చొప్పున వ్యయం
రేపటి నుంచి 38 రోజులపాటు..
ఉమ్మడి జిల్లాలో
15,742 మంది విద్యార్థులు
రూ.90,35,640 నిధులు మంజూరు
Comments
Please login to add a commentAdd a comment