కాంగ్రెస్‌లో కల్లోలం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో కల్లోలం

Published Thu, Apr 18 2024 10:25 AM

మల్దకల్‌లో ఘర్షణ పడుతున్న కాంగ్రెస్‌ నాయకులు  
 - Sakshi

గద్వాల రూరల్‌: నడిగడ్డ కాంగ్రెస్‌ పార్టీలో వర్గవిభేదాలు మరింత ముదిరాయి. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న వివిధ పరిణామాల నేపథ్యంలో ఎడముఖం పెడముఖంగా ఉంటూ వర్గాలుగా విడిపోయిన జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి మధ్య మంగళవారం రాత్రి శాంతినగర్‌లో మాటల యుద్ధం చోటుచేసుకోగా.. బుధవారం మల్దకల్‌లో ఇరు వర్గాల నాయకులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం సంచలనం రేపుతుంది.

● శాసనసభ ఎన్నికల ముందు జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి ఇద్దరూ కలిసికట్టుగా బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇరువురు నేతలు ఐక్యంగానే ఉంటూ బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. అయితే ఫలితాలు వారి అంచనాలకు భిన్నంగా రావడంతో నాలుగు నెలలుగా ఇరువురి నేతల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు అంతర్గత చర్చలలో విమర్శలు ప్రతి విమర్శలతో ఆధిపత్య ప్రదర్శనకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా మంగళవారం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అలంపూర్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమాచారాన్ని తమకు ఇవ్వడం లేదని బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి సరితను గట్టిగా ప్రశ్నించడంతో పాటు ఎన్నికల సమయంలో ఖర్చు చేసిన డబ్బుల వ్యవహారం వంటి అంశాలు కూడా చర్చకు రావడం, ఇది కాస్తా ముదిరి ఇరువురి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. జెడ్పీచైర్‌పర్సన్‌ సరితను దురుసు మాటలతో బాధపెట్టారని అక్కడే సరిత వర్గం నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిపై దాడికి యత్నించగా పక్కనే ఉన్న పార్టీ నాయకులు సర్ది చెప్పారు.

ముష్టియుద్ధం..

కాగా.. బుధవారం ఎన్నికల ప్రచారాన్ని గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్‌ మండలం నుంచి మొదలుపెట్టారు. ఈ క్రమంలో మల్దకల్‌లో ప్రచారరథం వాహనాన్ని ఎక్కేందుకు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు బండ్ల రాజశేశేఖర్‌రెడ్డి యత్నించగా వాహనంపై నున్న సరిత వర్గం నాయకుడు పెద్దొడ్డి రామకృష్ణ వాహనాన్ని ఎక్కవద్దని అడ్డుపడ్డాడు. ఈక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో అక్కడికి వచ్చిన బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి వాహనం ఎక్కవద్దు అనడానికి నీవెవరూ? అంటూ వాహనంపైనున్న పెద్డొడ్డి రామకృష్ణను చొక్కాపట్టుకొని కిందికి లాగాడు. దీంతో కోపోద్రిక్తుడైన పెద్దొడ్డి రామకృష్ణ వెంటనే బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిపై దాడికి పాల్పడడంతో అతడు కిందపడిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొనగా అక్కడే ఉన్న మరికొందరు పార్టీ కార్యకర్తలు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిపై ముష్టిఘాతాలు కురిపించడంతో అతను గాయపడ్డారు. అక్కడే ఉన్న బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయులు ఆయనను చికిత్స నిమిత్తం మల్దకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గద్వాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రభావం..?

ద్వాల కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న నేతల మధ్య అనైక్యత, వర్గవిభేదాలు పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసేవిగా ఉండనున్నాయని విశ్లేషకులు అభ్రిపాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో విభేదాలు పక్కన పెట్టి ఒక్కతాటిపై నడవాల్సిన నాయకులు ఇలా ముష్టియుద్దాలకు దిగడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గద్వాల కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు

జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత వర్సెస్‌ బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి

నిన్న శాంతినగర్‌లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం

నేడు మల్దకల్‌లో ఇరు వర్గాల నేతల పరస్పర భౌతిక దాడులు

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ ఎన్నికపై ప్రభావం?

Advertisement
Advertisement