వనపర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు | Sakshi
Sakshi News home page

వనపర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు

Published Fri, Apr 19 2024 1:45 AM

ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న కాంగ్రెస్‌పార్టీ గోపాల్‌పేట మండలం అధ్యక్షుడు గణేష్‌గౌడ్‌   
 - Sakshi

వనపర్తి: జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. కొత్త, పాత నేతలంటూ రెండు గ్రూపులయ్యాయి. ఆధిపత్యం కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎవరికి వారు సొంత క్యాడర్‌ను తయారు చేసుకునే ప్రయత్నం.. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తుండటం విభేదాలకు దారితీస్తోంది. ఈ విషయంపై రెండు వర్గాల నాయకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మరికొందరు వ్యక్తిగతంగా తీసుకుని గుడి ఎక్కుదాం.. దేవుళ్లపై ప్రమాణం చేద్దామంటూ సామాజిక మాధ్యమాల వేధికగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొన్నాళ్లకే పార్టీ రెండుగా చీలడం.. సొంత పార్టీ నాయకులే విమర్శలు చేసుకోవడం ప్రతిపక్ష పార్టీలు, ప్రజల దృష్టిలో పార్టీని చులకన చేశాయి. ఇటీవల పెబ్బేరు మండలం రంగాపూర్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి సమక్షంలో కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధమైతే.. ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుని చిన్నారెడ్డి వేసిన పార్టీ కండువాలను లాగేశారు. వారు చేసిన అఘాయిత్యాలు మీకు తెలియవు.. అధికారం ఎక్కడుంటే అక్కడికి వచ్చే వారిని ప్రోత్సహించొద్దని చెప్పడంతో చిన్నారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా అదే తరహాలో గోపాల్‌పేట మండలం తాడిపర్తికి చెందిన ఇద్దరు బీఆర్‌ఎస్‌ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు చర్చలు చేసినట్లు సమాచారం తెలుసుకుని అదే గ్రామానికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు గణేష్‌గౌడ్‌ వారిని పార్టీలో చేర్చుకోవద్దని.. పదేళ్లుగా తమపై అధికార జులూం చూపి కేసులు పెట్టి వేధించారని చెప్పేందుకు గురువారం స్థానిక తిరుమల హిల్స్‌లోని ఎమ్మెల్యే ఇంటికి అనుచరులతో కలిసి వచ్చారు. ఎమ్మెల్యేతో మాట్లాడుతూనే.. పక్కనే ఉన్న అదే మండలానికి చెందిన సత్యశీలారెడ్డి తమను ధూషించాడనే కోపంతో గణేష్‌ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించాలని అగ్గిపెట్టె తీసి ఎమ్మెల్యే చేతికి ఇవ్వబోయారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన గన్‌మెన్లు అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వర్గీయులు గణేష్‌గౌడ్‌తో పాటు ఆయన అనుచరులను పంపించాలంటూ ఘర్షణకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసి గణేష్‌గౌడ్‌ను అక్కడి నుంచి పంపించారు.

సమస్య ఇలా మొదలైంది..

గతేడాది డిసెంబర్‌ 3న అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో జిల్లాకేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రసంగిస్తూ.. నవంబర్‌ 30 వరకు కాంగ్రెస్‌పార్టీలో ఉన్నవారే కొనసాగుతారని, నాయకులు సిఫారస్‌ చేస్తే తప్పా.. ఇతర పార్టీల వారిని చేర్చుకోనని బహిరంగంగా ప్రకటించారు. టికెట్‌ ఆశించి భంగపడిన డా. జి.చిన్నారెడ్డికి కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం కేబినేట్‌ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పదవి కట్టబెట్టింది. దీంతో పదవి పొందిన ఆయన ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులను పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు చేరికలకు గేట్లు ఎత్తినట్లు సంకేతాలు ఇవ్వడంతో ప్రతిపక్ష కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, పలువురు నాయకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరడం మొదలెట్టారు. వర్గాన్ని పెంచుకునే ప్రయత్నంలో అప్పట్లో అధికారం ఉందని అడ్డగోలు కేసులు పెట్టించిన వారిని పార్టీలో చేర్చుకోవడం.. ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న వారు వాటిని వ్యతిరేకించడంతో ఘర్షణలు, ఆత్మహత్యయత్నంలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి.

పథకం ప్రకారమే..

పథకం ప్రకారమే వాళ్లు పెట్రోల్‌ తీసుకొని వచ్చారని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఒంటిపై పెట్రోల్‌ చల్లుకునే క్రమంలో తనపై కూడా పడిందని.. తనకు కూడా ప్రమాదం జరిగేది కదా అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరోదారి అన్నట్లుగా మారిన వైనం

చేరికల విషయంలో రెండుగా చీలిక నాయకులు

ఎమ్మెల్యే ఇంటి ఎదుట పార్టీ గోపాల్‌పేట మండల అధ్యక్షుడి ఆత్మహత్యాయత్నం

ముదిరిన విభేదాలు

కష్టపడి పనిచేసే వారిని పట్టించుకోవడం లేదు..

బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు, ఇబ్బందులకు గురైన వారి మాట వినకపోవడంతోనే తాను ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నానని పార్టీ గోపాల్‌పేట మండల అధ్యక్షుడు గణేష్‌గౌడ్‌ అన్నారు. గురువారం గోపాల్‌పేట మండలం తాడిపర్తిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పదేళ్ల పాటు ఇబ్బందులకు గురిచేశారని.. పార్టీలో చేర్చుకోవద్దని ఎమ్మెల్యేను కోరానని, అంతలోనే పక్కనున్న వారు తీవ్ర ఇబ్బందికర పదజాలంతో మాట్లాడటంతో మనస్తాపానికి గురై పెట్రోల్‌ పోసుకుని ఎమ్మెల్యేకు అగ్గిపెట్టె ఇచ్చానని చెప్పారు. భవిష్యత్‌లో కూడా వారిని పార్టీలో చేర్చుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నా రు. పార్టీలో గణేష్‌గౌడ్‌ కూడా కుటుంబ సభ్యుడేనని.. ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందేనని తెలిపారు. ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తులు పార్టీలో చేరినా భవిష్యత్‌లో ప్రమాదమేనన్నారు. జరిగిన విషయంపై ఎమ్మెల్యే పునరాలోచించాలని, స్థానిక నాయకుల అభిప్రాయాలు తీసుకుని పార్టీలో చేర్చుకోవాలని కోరారు.

Advertisement
Advertisement