గ్రంథాలయాలు.. విజ్ఞాన భాండాగారాలు
గద్వాలటౌన్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని.. యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి గంట కవితాదేవి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం స్థానిక గ్రంథాలయం కార్యాలయం, సంతాన వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు, మహిళలు ఉత్సాహంగా ముగ్గులు వేసి తమ సృజనాత్మకతను చాటారు. కొన్ని ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగులద్దుకున్న రంగవల్లులతో పుడమితల్లి పులకించింది. గ్రంథాలయ ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి గంట కవితాదేవి హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలను మరింత అభివృద్ధిపరిచి.. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే యువతకు అన్నిరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. తెలుగు సంప్రదాయాన్ని చాటుతూ ముగ్గులు వేసిన విద్యార్థినులు, మహిళలను అభినందించారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్గులు ప్రతీకగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కాంతమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, గ్రంథాలయ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment