ఊపందుకోని కొనుగోళ్లు
ఉమ్మడి జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాని ధాన్యం కేంద్రాలు
● చాలాచోట్ల తేమశాతం పేరుతో
ముందుకు సాగని వైనం
● సింహభాగం ప్రైవేటు వ్యాపారులకే
తరలుతున్న సన్నాలు
● ప్రభుత్వం ఇచ్చే బోనస్
కోల్పోతున్న రైతులు
సాక్షి, నాగర్‌కర్నూల్:
ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ఇంకా ఊపందుకోలేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల కేంద్రాలను ప్రారంభించామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. చాలాచోట్ల ఇప్పటివరకు ధాన్యం సేకరణ మొదలుపెట్టలేదు. తేమశాతం పేరుతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఓ వైపు కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం, నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఆరబోసేందుకు వీలుకాక తక్కువ ధరకే ప్రైవేటుకు అమ్ముకుని నష్టపోతున్నారు. ఈసారి సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ ధరను ప్రకటించినప్పటికీ చాలామంది రైతులు ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ధరను లబ్ధిపొందలేకపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 8,360 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, మిగతా చోట్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 564 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు సేకరించారు. వనపర్తి జిల్లాలో 3,266 మెట్రిక్ టన్నులు, నారాయణపేట జిల్లాలో 3,107 మెట్రిక్ టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 750 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్ణీత తేమ శాతం 14 లోపు ఉంటేనే అధికారులు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల తేమశాతం ఉన్నా కొనుగోళ్లు మాత్రం ప్రారంభించడం లేదని రైతులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు
జిల్లా కొనుగోలు ప్రా.వి ఇప్పటివరకు కొన్న
కేంద్రాలు ధాన్యం
(మెట్రిక్ టన్నుల్లో)
మహబూబ్‌నగర్ 189 189 8,360.60
నాగర్‌కర్నూల్ 252 252 564
వనపర్తి 262 183 3,266
జోగుళాంబ గద్వాల 64 64 750
నారాయణపేట 101 101 3,107
ప్రా.వి: ప్రారంభించినవి
నామమాత్రంగా కొనుగోళ్లు..
నాలుగు రోజులుగా పడిగాపులు..
మాకున్న పొలంలో 2 ఎకరాల్లో వరి పంట సాగు చేశాం. ఈ రోజో రేపో కొనుగోళ్లు ప్రారంభిస్తారని చెప్పడంతో ధాన్యాన్ని ధరూరు కేంద్రానికి తెచ్చి వారం రోజులుగా వడ్లకు కాపలాగ ఉంటున్నాం. పందుల బెడద తీవ్రంగా ఉంది. 10 నిమిషాలు మనిషి లేకపోతే ధాన్యమంతా పందుల పాలవుతోంది.
– వీరేష్, రైతు, ధరూరు
తేమశాతం ఉండట్లేదు..
జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నిర్ణీత తేమశాతం కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉండగా ఇందుకు సమయం పడుతోంది. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న బోనస్ కేవలం రెండు రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ అవుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– రాజయ్య, జిల్లా పౌర సరఫరాశాఖ
మేనేజర్, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment