22న దివ్యాంగులకు క్రీడా పోటీలు
గద్వాల అర్బన్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 22న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు సీ్త్రశిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్స్ విభాగంలో 10–17 ఏళ్ల బాలబాలికలు, సీనియర్స్ విభాగంలో 18–35 ఏళ్ల సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా ఆటల పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు, ఆధార్, సదరం సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఎవరి ట్రైసైకిల్ వారే తెచ్చుకోవాలని తెలిపారు. జిల్లాలోని శారీరక, అంధ, బధిర, మానసిక దివ్యాంగులు, దివ్యాంగ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
వరికొయ్యలు
కాల్చడంతో అనర్థాలు
గద్వాల రూరల్: పంట పొలాల్లో వరికొయ్యలను కాల్చడంతో తీవ్ర అనర్థాలు సంభవిస్తాయని వ్యవసాయశాఖ డివిజన్ సంచాకురాలు సంగీతలక్ష్మి అన్నారు. మండలంలోని చెనుగోనిపల్లిలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరికొయ్యలు కాల్చడంతో గాలిలో ఏర్పడే విష వాయువులతో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వరికొయ్యలకు నిప్పు పెట్టకుండా ఎస్‌ఎస్‌పీ 50 కేజీలు, 20 కేజీల యూరియా చల్లాలని.. తద్వారా భూమిలో పోషకాలు పెరిగి, పంటకు అందుతాయని చెప్పారు. అదేవిధంగా భూమి గుల్లబారి పంటకు మేలు చేకూరుతుందన్నారు. అనంతరం ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఎరువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని.. తగిన నిల్వలు ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ సిబ్బంది ఉన్నారు.
ఎన్నికల్లో లబ్ధికోసమే విద్వేష రాజకీయాలు
గద్వాల అర్బన్: ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ విద్వేష రాజకీయాలను సృష్టిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వేస్లీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వంటి అంశాలతో ముందుకెళ్తూ.. ప్రజల మధ్య విభజన రాజకీయాలను పెంచి, దేశ ప్రతిష్టను దిగజారుస్తుందని విమర్శించారు. బీజేపీ విధానాలను ప్రజలు వ్యతిరేకించి, తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. పెండింగ్‌లో నెట్టెంపాడ్ ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని.. అన్ని విభాగాల్లో పూర్తిస్ధాయిలో అధికార యంత్రాంగాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవీ రమణ, జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, రాజు, వీవీ నర్సింహ, రేపల్లే దేవదాస్, పరంజ్యోతి, ఈదన్న, ఉప్పేరు నర్సింహ ఉన్నారు.
సహకార సంఘాలతోనే అభివృద్ధి సాధ్యం
రాజోళి: సహకార సంఘాలతోనే చేనేత కార్మికుల అభివృద్ధి సాధ్యమని డీసీఓ శ్రీనివాస్ అన్నారు. సహకార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రాజోళిలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి సహకార సంఘాలు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. సహకార సంఘాల ద్వారా అందిస్తున్న పథకాలపై అవగాహన కలిగి ఉండాలని కార్మికులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment