సైబర్ మాయ..!
ఉమ్మడి పాలమూరును బెంబేలెత్తిస్తున్న సైబర్ మోసాలు
గత సంవత్సరంతో పోలిస్తే 15.42 శాతం పెరిగిన నేరాలు
ఈ ఏడాది అమాయకుల నుంచి రూ.10 కోట్ల మేర దోపిడీ
అన్ని జిల్లాల్లోనూ అంతంత మాత్రంగానే స్వాధీనం
‘గోల్డెన్ అవర్’లోనే సొమ్ము రికవరీకి అవకాశం
● ఈ ఏడాది జూన్ 28న గద్వాల జిల్లాకేంద్రానికి చెందిన ఎంఈఓ స్థాయి ప్రభుత్వ విద్యాధికారికి ఓ అపరిచిత వ్యక్తి వాట్సాప్ వీడియో కాల్ చేసి మాట్లాడాడు. తప్పుడు ధ్రువపత్రాలతో లోన్ తీసుకున్నావని నమ్మబలికారు. మీపై కేసు నమోదు చేశామని.. వెంటనే మేము చేప్పిన ప్రాంతానికి రావాలని ఆదేశించారు. కేసు నుంచి మినహాయింపు కావాలంటే మేము చెప్పిన ఖాతాలోకి నగదును అన్‌లైన్ ద్వారా చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఎలాగైనా కేసు నుంచి బయటపడేందుకు ఆ అధికారి రూ.1.80 లక్షలను ఆన్‌లైన్‌లో వారి ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత ఇలా జరిగిందని ఆయన తన స్నేహితులకు వివరించగా.. ఇది ఫ్రాడ్ అని వారు చెప్పారు. దీంతో సదరు వ్యక్తి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
● ఆన్‌లైన్ ట్రేడింగ్ మార్కెట్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని అపరిచిత వ్యక్తి ఒకరు గద్వాలకు చెందిన ఓ ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగికి ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా నమ్మబలికారు. నమ్మిన సదరు ఉద్యోగి పెట్టుబడి పెట్టాడు. లాభాలు రావడంతో ట్రేడింగ్ కంపెనీ నుంచి నగదు డ్రా చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. సదరు కంపెనీ నిర్వాహకులు పన్నుల రూపంలో చెల్లించేందుకు కొంత నగదును జమ చేయాల్సిందిగా పేర్కొన్నారు. దీంతో అతడు మరికొంత నగదును డిపాజిట్ చేశాడు. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో రూ.1.50 లక్షలు మోసపోయినట్లు గ్రహించి పట్టణ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు.
దైనందిన జీవితంలో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో ప్రజలు ఆన్‌లైన్, మొబైల్ సేవలపై ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్ల్లు, లింక్‌లతో మభ్యపెట్టి అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్న ఎందరో డబ్బులతో పాటు ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్ మోసానికి గురైన వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరు.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన సైబర్ మోసాల కేసుల శాతం.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
జిల్లాల వారీగా ఇలా..
మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాదిలో సైబర్ నేరగాళ్లు సుమారు రూ.4 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు అంచనా. ఇందులో కేవలం రూ.55,000 రికవరీ అయ్యాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో సైబర్ మోసగాళ్లు అమాయకుల నుంచి రూ.57,96,325 దోచుకోగా.. పోలీసులు వారి నుంచి రూ. 10,08,278 రికవరీ చేశారు.
గద్వాల జిల్లాలో సైబర్ కేటుగాళ్ల బారిన పడిన అమాయకులు రూ.3,83,50,299 కోల్పోగా.. పోలీసులు 10,59, 051 రికవరీ చేశారు. ఇవి పోనూ పలువురు బాధితులకు సంబంధించిన రూ.55,29,181 పలు బ్యాంక్‌లలో ఫ్రీజింగ్‌లో ఉన్నాయి.
నారాయణపేట జిల్లాలో రూ.13,13,000కు గాను ఇప్పటివరకు పోలీసులు రూ.1,63,000 మాత్రమే రికవరీ చేయగలిగారు.
వనపర్తి జిల్లాలో రూ.1.50 కోట్లకు గాను ఇప్పటివరకు కేవలం రూ.5.30 లక్షలు రికవరీ అయినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.
రూ.9.24 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
గద్వాల క్రైం: ఓ వ్యాపారి బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు నుంచి రూ.9.24 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలిలా.. గద్వాల మండలం సంగాల గ్రామానికి చెందిన వ్యాపారి చెట్టుకింది అయ్యపురెడ్డి వ్యక్తిగత బ్యాంకు ఖాతా (యూనియన్ బ్యాంకు)నుంచి, అలాగే క్రెడిట్ కార్డు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 17, 20వ తేదీల్లో మొత్తం రూ. 9.24లక్షలు కాజేశారు. అయితే నగదు డ్రా అయినట్లు వ్యక్తిగత మెయిల్‌కు సమాచారం రావడంతో బ్యాంకు అధికారుల నుంచి లావాదేవీల వివరాలు తెలుకున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు అయ్యపురెడ్డి వ్యక్తిగత ఖాతా నుంచి, అలాగే క్రెడిట్ కార్డు చివరి నాలుగు అంకెలు మార్పులు చేసి లావాదేవీలు జరిపినట్లు అధికారులు నివేదికలు అందజేశారన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు తన క్రెడిట్ కార్డు, వ్యక్తిగత ఖాతాలోంచి నగదు కాజేసినట్లు గుర్తించి ఈ నెల 28వ తేదిన గద్వాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మోసాలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం అందించాల్సిందిగా బాధితుడు తెలిపారు.
ఈ ఏడాది 15.42 శాతం పెరిగిన కేసులు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతేడాదిలో 1,766 సైబర్ కేసులు నమోదు కాగా.. ఈ సంవత్సరం 2,724 నమోదయ్యాయి. ఈ లెక్కన 15.42 శాతం మేర సైబర్ నేరాల శాతం పెరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఒక్క నారాయణపేట జిల్లాలోనే సైబర్ నేరాల సంఖ్య తగ్గగా.. మిగతా అన్ని జిల్లాల్లోనూ పెరిగాయి. నమోదైన కేసులు కొన్ని మాత్రమే కాగా.. తమ పేర్లు బయటకు వస్తాయని, ఇతరత్రా కారణాలతో ఫిర్యాదు చేయని వారే అధిక సంఖ్యలో ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
కొల్లగొట్టింది రూ.10 కోట్లు.. రికవరీ రూ.28.15 లక్షలే..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సైబర్ కేటుగాళ్లు ఈ సంవత్సరంలో అమాయకుల నుంచి రూ.10.05 కోట్లు కొల్లగొట్టారు. ఇందులో 28.15 లక్షలు మాత్రమే రికవరీ కాగా..పోలీసులు న్యాయప్రక్రియ పూర్తి చేసి ఆయా బాధిత వ్యక్తులకు అందజేశారు. బ్యాంకుల్లో ఫ్రీజ్ అయినవి సుమారు రూ.2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అంటే సైబర్ కేటుగాళ్లు మిగతా సొమ్మును మింగేసినట్లు అర్థమవుతోంది.
ఇలా మోసపోతున్నారు..
జిల్లాలో నమోదైన సైబర్‌క్రైం కేసుల్లో అధికంగా వేక్ యాప్‌లలో అధిక లాభాలకు ఆశపడి పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారే ఉన్నారు. ఏపీకే యాప్ లింక్‌లపై టచ్ చేసి ఖాతాల్లోని నగదును పొగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో రుణం ఇప్పిస్తాం.. కొంత డబ్బులు డిపాజిట్ చేయాలని, క్రెడిట్ కార్డు బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పి ఆన్‌లైన్‌లో లింక్‌లు పంపించి.. ఫోన్ కాల్స్, బ్యాంక్ ఏటీఎంల పేరుతో నగదు అపహరించినట్లు కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్న వారిలో విద్యాధికులే ఉండడం గమనార్హం. అత్యాశే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment