15 నుంచి ఉమామహేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
అచ్చంపేట రూరల్/అమ్రాబాద్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో ఈ నెల 15నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయ పాలక మండలితో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
● అమ్రాబాద్ మండలంలోని తెలుగుపల్లి ఆంజనేయస్వామి ఆలయంతో పాటు అటవీ ప్రాంతంలోని అంతర్‌గంగ శివాలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో పురాతన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం నల్లమలను సందర్శించి పర్యాటకానికి అనువైన ప్రాంతాలను పరిశీలించినట్లు చెప్పారు. అంతేకాకుండా రూ. 7,700 కోట్లతో మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు హైవేతో పాటు ఎలివేటెడ్ కారిడార్ మంజూరైందని అన్నారు. ముఖ్యంగా మద్దిమడుగు సమీపంలోని కృష్ణానదిపై వంతెన నిర్మాణం, రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ భీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు కట్ట శేఖర్‌రెడ్డి, పవన్, వినోద్, అర్చకుడు వీరయ్యశాస్త్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినారాయణగౌడ్, వెంకటయ్య, ముక్రాంఖాన్, మనోహర్, వెంకటయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment