శాశ్వత పరిష్కారం ఎప్పుడో..?
గద్వాలలో ఓ ఇంటి ఎదుట ముగ్గులు వేస్తున్న యువతులు
●
ఆర్డీఎస్ కెనాల్‌లో సమస్యల తిష్ట
● నిత్యం కోతలు, తాత్కాలిక మరమ్మతుతో రైతుల అవస్థలు
● అధికారుల పర్యవేక్షణ అంతంతే..
● మరమ్మతుకు రూ.13 కోట్లు మంజూరు
● పూర్తి లైనింగ్ చేస్తేనే మేలంటున్న
ఆయకట్టు రైతులు
నిత్యం ఆందోళన
ఆర్డీఎస్ కెనాల్‌లో నీరు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అలాంటి కెనాల్ పై ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు నిత్యం ఆందోళన తప్పడం లేదు. కెనాల్ లో నీరు నిండుగా వస్తున్నాయని సంతోషించేలోగా.. కెనాల్ కోతకు గురి కావడం,పైకి ఎక్కి ప్రవహించి పంటలను ముంచేస్తుంది. దీంతో పంటల నష్టం తప్పడం లేదు.
– వెంకటేశ్వర్లు, రైతు, చెన్నిపాడు
పంటలకు నీరందట్లే..
ప్రతి ఏడాది కెనాల్‌కు ఎక్కడో ఒక చోట మరమ్మతులు తప్పడం లేదు. ఎగువన ఎక్కడైనా చిన్న కోతకు గురైనా కెనాల్‌లో నీరు నిలిపి వేయాల్సిందే. దీని వల్ల పంటలకు సక్రమంగా నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణతో ఎక్కడెక్కడ మరమ్మతు అవసరమో పంటలు వేయకముందే వాటిని పూర్తి చేస్తే బాగుంటుంది. సాగు మధ్యలో కెనాల్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలంటే చాలా కష్టంగా ఉంటుంది.
– గోవర్ధన్, మానవపాడు, రైతు
ప్రతిపాదనలు పంపించాం
గతంలో ఆర్డీఎస్ ఆధునీకరణ కోసం ప్రతిపాదనలు పంపించాం. కాని మంజూరు రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న నిధులతోనే అవసరమైన చోట మరమ్మతులు చేస్తున్నాం. కొన్ని చోట్ల లైనింగ్ మార్చాల్సిందే. గత నెలలో నారాయణపురం డిస్ట్రిబ్యూటరీ దగ్గర చనిపోయిన ఎద్దును కూడా కెనాల్‌లో వేశారు. కొంత సిల్ట్, పిచ్చి మొక్కల కారణంగా నీరు కెనాల్ పైకి ఎక్కి ప్రవహించింది. రైతులతో సమన్వయం చేసుకుని వాటిని తొలగించాం.
– విజయ్‌కుమార్ రెడ్డి, ఆర్డీఎస్ ఈఈ
రాజోళి: జిల్లాలో ఆర్డీఎస్ కెనాల్ ప్రవహిస్తున్న మండలాల్లో కెనాల్‌పై ఆశలు పెట్టుకుని వేలాది మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా కెనాల్ మరమ్మతులు చేయకపోవడం.. ఆధునీకరణ చేపట్టకపోవడం.. అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండడంతో కెనాల్‌లో నీరున్నా కూడా రైతులకు ఏదో రకంగా నష్టమే జరుగుతుంది. కెనాల్‌లో నీరు వచ్చేదే అంతంత మాత్రం కాగా.. అది కూడా ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు రావో తెలియని పరిస్థితి. వచ్చినప్పుడు కెనాల్ కోతలకు గురికావడం పరిపాటిగా మారింది. దీంతో కెనాల్ నుంచి రైతులకు జరిగే మేలుతో పాటు నష్టం కూడా తప్పడం లేదు. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టాలనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది.
తాత్కాలిక మరమ్మతుతోనే సరి..
కెనాల్ మరమ్మతుల కోసం రూ.13 కోట్లు కేటాయించినప్పటికీ అవి ఎక్కడ చేయాలనే అనుమానం, అధికారులకు, రైతులకు వెంటాడుతుంది. పూర్తిగా దెబ్బతిన్న చోట చేసేందుకు పనులు మొదలుపెట్టేలోగా మరో డిస్ట్రిబ్యూటరీ దగ్గర సమస్య మొదలువుతుంది. అన్ని చోట్ల ఒకేసారి పనులు చేసేంత నిధులు లేవు. తుమ్మిళ్ల లిఫ్టు నుంచి సాగు నీరు అందుతున్నప్పటి నుండి డి–24 దిగువకే ఎక్కువగా మరమ్మతులు చేయాల్సి వస్తుంది. తుమ్మిళ్ల ప్రెజర్ మెయిన్ కెనాల్ ద్వారా నీరు డి–24 దగ్గరే డెలవరీ కావడంతో కెనాల్ పటిష్టంగా ఉండాలి. ఏళ్ల కిందట చేసిన మరమ్మతులు కావడంతో కెనాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో తరుచూ ఇబ్బందులు తప్పడం లేదు. అందులో ప్రత్యేకించి తుమ్మిళ్ల నుంచి నీరు వచ్చే క్రమంలో కెనాల్‌పై ప్రెజర్ పడి కోతకు గురి కావడం, కెనాల్‌లో సిల్ట్, గడ్డి, ముళ్ల కంపలు పెరిగి, నీరు సాఫీగా ప్రవహించకుండా కెనాల్‌పైకి ఎక్కి పారడంతో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి నీరు వెళ్లి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కాగా అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో కూడా తరుచూ ఈ ఇబ్బందులు తప్పడం లేదని రైతులు అంటున్నారు. కెనాల్‌పై వారు నిత్యం పర్యవేక్షణ చేస్తే ఎక్కడెక్కడ అత్యవసరంగా మరమ్మతు చేయాలో తెలుస్తుందని రైతులు అంటున్నారు.
లైనింగ్ లేక ఇక్కట్లు..
ఎంతకాలం గడిచినా కేవలం చిన్నపాటి మరమ్మతులతో సరి చేస్తే అవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయని శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు అంటున్నారు. ప్రస్తుతం సిల్ట్ పేరుకుపోయిన చోట అది తీయకపోవడంతో పాటు, లైనింగ్ ఏర్పాటు చేయకపోవడం, కెనాల్‌కు ఇరువైపులా వేసిన సిమెంట్ బిల్లలు కూడా ఊడిపోవడంతో కెనాల్ కోత ,కెనాల్ పైకి నీరు ఎక్కి ప్రవహించడం జరుగుతున్నాయి. గత నెలలో మానవపాడు మండలం నారాయణపురం దగ్గర కెనాల్ పైకి నీరు ప్రవహించడంతో రైతుల పంట పొలాల్లోకి నీరు చేరింది. ఆ డిస్ట్రిబ్యూటరీ గేట్ల దగ్గర చనిపోయిన ఎద్దును పడేయడంతో దాని వల్ల కూడా నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నట్లు తెలస్తుంది. అది మాత్రమే కాకుండా కెనాల్‌లో విచ్చలవిడిగా పెరిగిన కంప చెట్లు, పేరుకుపోయిన సిల్ట్ కూడా ప్రధాన కారణమే అని రైతులు అంటున్నారు. వీటిపై సరైన పర్యవేక్షణ ఉన్నట్‌లైతే సమస్య అంత వరకు రాకుండా ముందుస్తు చర్యలతో దాన్ని నివారించేవారమని రైతులు అంటున్నారు. అంతకు ముందు వడ్డేపల్లి మండలం, అంతకు పూర్వం రాజోళి మండలంలో కూడా కెనాల్ కోతకు గురయ్యాయి. దీనిపై పూర్తి పర్యవేక్షణ ఉంటే ముందస్తు మరమ్మతులు ఎక్కడ చేయాలో తెలుసుకుని అక్కడ పనులు చేసి ఉంటే కొద్ది మేరనైనా మేలు జరిగేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మరమ్మతులతో తాత్కాలిక ప్రయోజనం మాత్రమేనన్న విషయాన్ని గుర్తించి, ఆధునీకరణ కోసం అధికారులు ప్రయత్నాలు చేయాలని, నాయకులు వారికి సహకరించాలని అంటున్నారు. ఆధునీకరణ చేయాల్సిన ఆవశ్యకతను అధికారులు క్షేత్ర స్థాయిలో ఆయకట్టుపై పర్యవేక్షణ చేయాలని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment