సాగునీటికి రోడ్డెక్కిన ఆర్డీఎస్ రైతులు
శాంతినగర్: ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందక సాగుచేసిన పంటలు ఎండుతున్నాయంటూ మంగళవారం అన్నదాతలు ఆగ్రహించి రోడ్డెక్కి నిరసన తెలిపారు. వడ్డేపల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకొని అలంపూర్–రాయచూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఎండుతున్న మొక్కజొన్న, జొన్న మొక్కలను ప్రదర్శిస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యాంలో 72 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ అధికారులు నీటిని విడుదల చేయకపోవడం బాధాకరమని.. రాజకీయ జోక్యంతో అప్పుడు ఇప్పుడంటూ నాయకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి పంటలు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఆయకట్టుకు సాగునీరు నిలిచిపోయిందంటూ ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. మార్చి నెలాఖరు వర కు సాగునీరు విడుదల చేయకపోతే ఆయకట్టు కింద 30 వేల ఎకరాల పంటలు ఎండిపోతాయని, అ లాంటి పరిస్థితి తలెత్తితే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రోడ్డెక్కితే అనుమతులు లేవు.. అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరించడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంతోశ్ అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని సూచించడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment