ఆయకట్టుకు చేరుకున్న ఆర్డీఎస్ నీరు
అయిజ: రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్డీఎస్ నీరు బుధవారం మధ్యాహ్నానికి మండలంలోని సింధనూరు గ్రామ సమీపంలోని డిస్టిబ్యూటరీ 12ఏ ను చేరుకుంది. ఇటీవల రాష్ట్రానికి ఇండెంట్ పెట్టినా సరే అయిజ మండంలోని ఆర్డీఎస్ ఆయకట్టు వరకు సాగునీరు చేరలేదు. దీంతో వెంటనే ఆంధ్రప్రదేశ్ వాటా (కేసీ కెనాల్‌కు) 2.5 టీఎంసీల ఇండెంట్ పెట్టడంతో మండలంలోని ఆర్డీఎస్ కాల్వకు సాగునీరు చేరుకుంది. రాత్రి సమయానికి ఉప్పల సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 20 వరకు నీరు చేరుకుంది. శనివారం నాటికి తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఆర్డీఎస్ కాల్వకు సాగునీరు సకాలంలో చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్ కోసం స్థల పరిశీలన
ఎర్రవల్లి: ఇటిక్యాల మండలంలోని పెద్దదిన్నె గ్రామంలో పీఎం కుసుమ్ పథకం ద్వారా నిర్మించే సోలార్ విద్యుత్ ప్లాంట్ కొరకు బుధవారం అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరేందర్ వివిధ శాఖల అధికారులతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన సర్వే నెంబర్ 66, 67, 68, 69, 75, 76, 77, 78, 79, 80, 82, 83 లలో దాదాపు 96 ఎకరాల 38 గుంటల ఎండోమెంట్ భూమిని పరిశీలించారు. కేంద్రం సోలార్ ప్లాంట్ నిర్మించేందుకు గాను పరిశీలించిన ఎండోమెంట్ భూమి వివరాలను ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్వేయర్ దౌలమ్మ, విద్యుత్ ఏఈ శేఖర్, ఎపిఎం కుర్మయ్య, ఆర్‌ఐ భీమ్‌సేన్‌రావ్ ఉన్నారు.
రాజ్యాధికారమే
అంతిమ లక్ష్యం
గద్వాలటౌన్: మహనీయుల సిద్ధాంతాలను భవిష్యత్ తరాలకు ఇవ్వాలని, రాజ్యాధికారమే తమ అంతిమ లక్ష్యమని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం బీఎస్పీ ఆధ్వర్యంలో జన కళ్యాణ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహంచారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. బీఎస్‌పీ చీఫ్ మాయావతి జన్మదినాన్ని పురస్కరించుకుని జన కళ్యాణ్ దివస్‌ను చేపట్టామన్నారు. బీఎస్‌పీ ద్వారానే దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతి జరుగుతుందన్నారు. మణికుమార్, రాజు, వెంకటేష్‌నాయక్, సవారన్న, మోహన్‌రాజు, నరేష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment