నేతన్నల్లో ఆనందం
●
● చేనేత సంక్షేమానికి నిధులు
మంజూరు చేసిన ప్రభుత్వం
● కొనసాగనున్న సంక్షేమ పథకాలు
సంతోషంగా ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం త్రిఫ్ట్ పథకాన్ని కొనసాగించేందుకు నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకంలో కార్మికుడు ప్రతి నెల రూ.1200 బ్యాంకులో జమ చేయడంతో ప్రభుత్వం వాటికి రెండింతలు చెల్లిస్తుంది. దీంతో కుటుంబ పోషణ సాఫీగా సాగుతోంది.
– గాజుల సంధ్య,
నేత కార్మికురాలు, అమరచింత
అమరచింత: బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన చేనేత సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యధావిధిగా కొనసాగిస్తూ ఇందుకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో నేతన్నలు సంతోషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నేతన్నకు చేయూత, త్రిఫ్ట్ ఫండ్, బీమా పథకాల అమలుకు ఏడాదికి ఎన్ని నిధులు అవసరమో వాటి ప్రకారం మంజూరు చేస్తూ గత పథకాలను యధావిధిగా కొనసాగించేందుకు సిద్ధమవ్వడంతో చేనేత, జౌళిశాఖ అధికారులు గ్రామాల్లోని చేనేత సొసైటీలను సంప్రదించి పథకాలకు సంబంధించిన వివరాలపై త్వరలోనే అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు లబ్ధి పొందుతున్న నేత కార్మికులకే వర్తింపజేస్తామని.. కొత్త దరఖాస్తులకు త్వరలోనే ప్రకటన జారీ చేస్తామని వివరించారు. తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల జీఓను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 10న జారీ చేసింది.
త్రిఫ్ట్ ఫండ్..
ఈ పథకం జియో ట్యాగ్ కలిగిన మగ్గాల నేత కార్మికులు, అనుబంధ కార్మికుల సంక్షేమానికి రూపొందించింది. కార్మికుల్లో పొదుపును ప్రోత్సహించడంతో పాటు సామాజిక భద్రత కల్పిస్తుంది. నేత కార్మికులు, అనుబంధ కార్మికులు వారి వేతనాల నుంచి నెలవారీగా 3 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తారు. కాంట్రిబ్యూషన్ గరిష్ట పరిమితి రూ.1200. ఇందుకు ప్రభుత్వం రెండింతలు అంటే రూ.2,400 అందిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 38 వేల మంది, జిల్లాలో 975 మంది నేత కార్మికులు, అనుబంధన కార్మికులు లబ్ధి పొందుతున్నారు. పవర్‌లూమ్, మరమగ్గాల కార్మికుల నెలసరి వాటాగా 8 శాతం బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం 8 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తుంది.
తెలంగాణ నేతన్న భద్రత..
ఈ పథకం జియో ట్యాగింగ్ ఉన్న చేనేత, మర మగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులకు వర్తిస్తుంది. నేతన్న భద్రతలో నమోదైన కార్మికుడు మృతిచెందితే రూ.5 లక్షల నగదు అతడి నామినీకి అందుతుంది. సహకార సంఘం ద్వారా బీమా కవరేజీ అందరికీ వర్తిస్తుంది. ఈ పథకంలో ఇప్పటి వరకున్న 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి ఇది వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు ఏడాదికి రూ.9 కోట్లు మంజూరు చేస్తారు.
నేతన్నకు భరోసా..
నేత కార్మికులకు వేతన ప్రోత్సాహకం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం. జియో ట్యాగ్ ఉన్న మగ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి రూ.18 వేలు. అనుబంధ కార్మికులకు రూ.6 వేలు వేతన సాయంగా అందిస్తారు. పథకం అమలుకు రాష్ట్రవ్యాప్తంగా వార్షిక బడ్జెట్‌లో రూ.44 కోట్లు మంజూరు చేశారు.
చేనేతన్నకు బీమా మంచిదే..
చేనేత కార్మికులకు ప్రభుత్వం బీమా లబ్ధి చేకూర్చేందుకు మార్గదర్శకాలను సవరించడం సంతోషం. గత ప్రభుత్వంలో వయో పరిమితి 65 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం 57 ఏళ్లకు సవరించడంతో అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం సంతోషం.
– పగుడాకులు పద్మమ్మ, కార్మికులు, అమరచింత
తెలంగాణ నేతన్న భద్రతకు
రూ.5.25 కోట్లు
తెలంగాణ నేతన్నకు చేయూతకు
రూ.15 కోట్లు
తెలంగాణ నేతన్న భరోసా పథకానికి రూ.31 కోట్లు
మార్గదర్శకాలు రాగానే..
రాష్ట్ర ప్రభుత్వం చేనేత సంక్షేమ పథకాల కొనసాగింపునకు నిధులు మంజూరు చేసింది. జిల్లాకు ఎన్ని నిధులు వస్తున్నాయి.. ఎంత మందికి లబ్ధి చేకూరుతుందన్న విషయాలపై ఇంకా మార్గదర్శకాలు అందలేదు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వచ్చిన వెంటనే కార్మికులకు సమాచారం ఇస్తాం. – గోవిందయ్య, ఏడీ
చేనేత, సిల్క్ మార్క్ మాదిరే తెలంగాణకు ప్రత్యేకమైన చేనేత మార్క్ లేబుల్ రూపొందించారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియానికి అనుగుణంగా తెలంగాణ చేనేత ఉత్పత్తుల లేబుల్ బ్రాండింగ్ చేస్తారు. తెలంగాణ చేనేత వస్త్రాల వారసత్వ, సంప్రదాయ ప్రతిష్టతను పెంపొందించడం, చేనేత బ్రాండ్ ప్రచారంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు, సముచిత మార్కెట్ సృష్టించడమే ప్రధాన లక్ష్యం.
చేనేత మార్క్..
Comments
Please login to add a commentAdd a comment