గ్రహణం వీడేదెన్నడో..?
వివరాలు 8లో u
●
11 ఏళ్లుగా కొనసాగుతున్న గద్వాల ఔటర్ రింగ్ రోడ్డు పనులు
● నిధుల లేమితో ముందుకు సాగని వైనం
● అసంపూర్తి పనులతో ఆరు మండలాల ప్రజల అవస్థలు
● ఇష్టానుసారంగా వెలసిన అక్రమ నిర్మాణాలు
నివేదిక పంపించాం
ఔటర్‌రింగు రోడ్డు పనులకు నిధులు లేకపోవడంతో ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం పనులు మొదలు పెట్టాలంటే గతంలో వేసిన రేట్లు పెరిగిపోయాయి. ప్రస్తుత ధరలకు అనుగుణంగా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడుతాం.
– ప్రగతి, ఆర్‌అండ్‌బీ ఈఈ, గద్వాల
గద్వాల: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఏళ్లుగా గద్వాల రింగ్‌రోడ్డు పనులు కొనసాగుతూ..నే ఉన్నాయి. ఇన్నేళ్లు పనులు ముందుకు కదలకపోయినా అటు పాలకులకు కాని, ఇటు అధికారులకు కాని చీమ కుట్టినట్లు కూడా లేదు. ఫలితంగా జిల్లాలోని ఆరు మండలాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దుగా ఉన్న రాయచూరుకు వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుతు పడుతున్న పరిస్థితి. 2013లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్వాల ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జమ్ములమ్మ నుంచి గద్వాల–రాయచూరు రోడ్డును కలుపుతూ 100 ఫీట్ల వెడల్పుతో 6.27 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం కోసం రూ.26కోట్లతో అంచనాలు రూపొందించారు. సర్వే పనులు పూర్తయిన అనంతరం 2014లో టెండర్లు నిర్వహించి మొదటి దశ పనులు చేపట్టారు. కొంతమేర పనులు పూర్తయినా ఆ తరువాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈక్రమంలోనే నిధులు లేమితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
రూ.26 కోట్లతో రింగ్‌రోడ్డు
ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్వాల చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు వెళ్లే రహదారి మార్గంలోని జమ్ములమ్మ వద్ద నుంచి గద్వాల–అయిజ రోడ్డును కలుపుతూ గద్వాల–రాయచూరుకు వెళ్లే రహదారి వరకు 6.27 కిలోమీటర్ల మేర 100 ఫీట్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రూ.26కోట్లతో అంచనాలు రూపొందించింది. ఇందులో సర్వే కోసం రూ.15 లక్షలు, భూసేకరణకు రూ.4 కోట్లు, రోడ్డు నిర్మాణం కోసం రూ.8.76 కోట్లు, ఆర్వోబి కోసం రూ.7.58 కోట్లు, వివిధ ప్రాంతాలలో స్టక్చర్స్ నిర్మాణాల కోసం రూ.1.1 2కోట్లు, విద్యుత్ పోల్స్‌కు రూ.7లక్షలతో అంచనాలతో డీపీఆర్ రూపొందించి టెండర్ ప్రక్రియ చేపట్టింది. ఇందులో గద్వాల–రాయచూరు రోడ్డు మొదలుకుని గద్వాల–అయిజ వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆ తరువాత జమ్ములమ్మ ప్రధాన రహదారి వరకు చేపట్టాల్సిన పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదిలాఉండగా, నడిగడ్డగా పిలువబడే అలంపూర్ – గద్వాల నియోజకవర్గాల ప్రజలకు నిత్యం వివిధ రకాల పనుల నిమిత్తం రోజుకు సుమారు 20 వేల నుంచి 40వేలకుపైనే రాకపోకలు కొనసాగిస్తుంటారు. రింగ్‌రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో గద్వాల పట్టణం లోపలి నుంచి రాయచూరు, అయిజ, హైదరాబాద్, కర్నూల్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వెలసిన
అక్రమ నిర్మాణాలు
ఇదిలాఉండగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో గద్వాల ఔటర్‌రింగురోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకుండా పోయిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం ఒక్క రూపాయిని ప్రభుత్వం విడుదల చేయలేదంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. దీనికితోడు గద్వాలఔటర్ రింగు రోడ్డు ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో చాలా చోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ముఖ్యంగా జమ్ములమ్మ ఆలయం వద్ద ప్రభుత్వ భూములలో అక్రంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇళ్ల నిర్మాణాలు, ఫంక్షన్ హాళ్లు వెలిశాయి. ఆక్రమణదారులు వీటిని దర్జాగా అద్దెకిచ్చుకుని నెలనెలా డబ్బులు వెనకేసుకుంటున్నారు. రింగురోడ్డు పనులు పూర్తిచేయాలంటే ఇక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆక్రమణలపై అధికారులకు తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment