ముగిసిన శివాంజనేయస్వామి ఉత్సవాలు
ఎర్రవల్లి/ఇటిక్యాల: మండలంలోని వావిలాల శివాంజనేయస్వామి బ్రహ్మాత్సవాలు గురువారం ఘనంగా ముగిసాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఆలయంలో తెప్పోత్సవం, పల్లకీసేవ కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అంతరాష్ట్ర ఆరు పండ్ల విభాగం బండలాగుడు, పొటేళ్ల పందెం పోటీలు అట్టహాసంగా జరిగాయి.
అట్టహాసంగా పోటీలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పదుల సంఖ్యలో పొటేళ్లు పందెం పోటీల్లో పాల్గొనగా.. నంద్యాల జిల్లాలోని తిమ్మాపురంకు చెందిన హనుమ పొట్టేలు మొదటి స్థానంలో నిలిచింది. అయిజ మండలం బింగిదొడ్డికి చెందిన పరుశరాముడు పొట్టేలు రెండు, కర్నూలు జిల్లా ముళ్లగుర్తికి చెందిన భైరవ పొట్టేలు మూడు, అయిజ మండలానికి చెందిన నర్సింహ పోట్టేలు నాల్గో స్థానంలో నిలిచి వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు కై వసం చేసుకున్నాయి. అలాగే, ఆరుపళ్ల బండ లాగుడు పోటీల్లో కర్నూల్ జిల్లాలోని పిన్నాపురంకు చెందిన వెంకట కృష్ణయ్య వృషభాలు మొదటి స్థానంలో నిలిచి రూ.40వేలు, మండలంలోని సాతర్లకు చెందిన హర్షద్ భాషా వృషభాలు రెండోస్థానంలో నిలిచి రూ.30వేలు, వనపర్తి జిల్లాలోని పెద్దదగడకు చెందిన యశ్వంత్ యాదవ్ వృషభాలు మూడోస్థానంలో నిలిచి రూ. 20వేలు గెలుచుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీసభ్యులు రంగారెడ్డి, రామయ్య, విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మాణిక్యారెడ్డి, గ్రామ పెద్దలుపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment