నెలాఖరు వరకు వాటాధనం సమకూర్చాలి
శాంతినగర్: ఈనెల చివరి వరకు రూ.15 లక్షలు వాటాధనం సమకూర్చాలని రైతు ఉత్పత్తి దారుల సంఘం చైర్మన్లు అన్నారు. వడ్డేపల్లి రైతు వేదికలో వడ్డేపల్లి, ఇటిక్యాల, రాజోళి, ఐజ, గట్టు మండలాలకు చెందిన రైతు ఉత్పత్తి దారుల సంఘాల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘంలోని వాటాదారులు, సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. సెంట్రల్ సెక్టార్ స్కీంలో బాగంగా 2022లో జిల్లాలో ఐదు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఐదు సంస్థలలో ఇప్పటివరకు 3 వేల మంది రైతులు సభ్యత్వం తీసుకున్నారన్నారు. సభ్యత్వం ద్వారా రూ.30 లక్షల వాటాధనం సమకూర్చామని, ఇప్పటివరకు రూ.2 కోట్ల వరకు ఇన్పుట్ వ్యాపారం జరిగిందన్నారు. 300 ఎకరాల్లో చీని, మామిడి మొక్కలు ఉచితంగా ఇచ్చామని, సభ్యత్వం తీసుకున్న రైతులకు విత్తనాలు, ఫర్టిలైజర్, బ్యాటరీ పంపులు, పరదలు, డ్రిప్పు మందులు, సోలార్ లైట్లు, కలుపు తీసే యంత్రాలు, విత్తనాలు వేసే పరికరాలు అందజేశారన్నారు. ప్రతి గ్రామంలో సంఘం తరపున షాపులు ఏర్పాటుచేయాలని, రైతులకు విత్తనాలు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అందుబాటులో వుండేలా చూడాలని, సంఘాలు వ్యాపారం చేసుకోడానికి న్యాబ్ కిసాన్ సంస్థ ప్రతి సంఘానికి రూ.6 లక్షలు లోన్ మంజూరుచేస్తుందని చైర్మన్లు వివరించారు. సమావేశంలో వడ్డేపల్లి రైతు సంఘం చైర్‌పర్సన్ దేవేంద్ర, రాజోళి వెంకటేశ్వర్లు, ఇటిక్యాల యుగంధర్‌రెడ్డి, డైరెక్టర్లు సుధాకర్‌గౌడ్, లక్ష్మికాంతరెడ్డి, హనుమంతురెడ్డి, నర్సింహులు, మహేంద్రగౌడ్, తిమ్మప్ప, సీఎస్‌ఏ ప్రతినిధులు రమేష్, వీరబాబులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment