సీఎం జగన్‌తోనే సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తోనే సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి

Published Tue, May 7 2024 11:35 AM

సీఎం

కిర్లంపూడి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పాస్టర్ల సంఘాలు, కిర్లంపూడి గ్రామానికి చెందిన ఆటో యూనియన్ల సభ్యులు అధిక సంఖ్యలో సోమవారం కిర్లంపూడి చేరుకుని, ముద్రగడను, యువ నాయకుడు గిరిబాబును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారినుద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ, వాహనదారులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం అమలు చేశారన్నారు. దీని ద్వారా ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌లు నడుపుకొంటూ జీవిస్తున్న వారికి ఏడాదికి రూ.10 వేల సాయం అందజేసి ఆర్థికంగా ఆదుకున్నారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోరే సీఎం జగన్‌ మళ్లీ అధికారంలోకి రావటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. ఒక్కొక్కరు 50 కుటుంబాలను ఎంచుకుని వారితో వైఎస్సార్‌ సీపీకి ఓటు వేసేలా శక్తివంచన లేకుండా పని చేయాలన్నారు. సీఎం జగన్‌ అధికారంలోకి వస్తే స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందన్నారు. వైఎస్సార్‌ సీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్‌ను, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న తోట నరసింహం, వంగా గీతలను అఖండ మెజార్టీతో గెలిపించి, వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంను చేయాలని ముద్రగడ అభ్యర్ధించారు. ఆటో యూనియన్ల నాయకులు మాట్లాడుతూ ముద్రగడ నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. సీఎం జగన్‌ పాలనలో వాహనదారులకు ఎంతో మేలు జరిగిందని అన్నారు.

నిలకడగా వర్జీనియా

పొగాకు ధర

రూ.295 కోట్ల విక్రయాలు

కిలో గరిష్ట ధర రూ.332

దేవరపల్లి: మార్కెట్లో వర్జీనియా పొగాకు ధర నిలకడగా ఉంది. వారం రోజుల నుంచి మార్కెట్లో ధర స్వల్పంగా తగ్గింది. గత వారం కిలో గరిష్ట ధర రూ.342 పలకగా.. ప్రస్తుతం రూ.10 తగ్గించి రూ.332కు కొనుగోలు చేస్తున్నారు. ఈ స్థాయిలో ధర పలుకుతుందని రైతులు, అధికారులు ఊహించలేదు. ఇప్పటి వరకూ 45 రోజులు వేలం నిర్వహించారు. మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ 10.78 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. దీని విలువ రూ.295 కోట్లని టొబాకో బోర్డు అధికారులు తెలిపారు. మార్కెట్లో సోమవారం కిలోకు గరిష్టగా రూ.332, కనిష్టంగా రూ.235, సగటున రూ.274.57 చొప్పున రైతులకు ధర లభించింది. 5,615 బేళ్లు అమ్మకానికి రాగా, 4,997 బేళ్లు కొనుగోలు చేశారు.

సీఎం సభకు సర్వం సిద్ధం

మధురపూడి: కోరుకొండలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం పాల్గొంటున్న సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ సభకు ప్రజలు అశేషంగా తరలి కానున్న నేపథ్యంలో పోలీసు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాపవరం పెట్రోలు బంకు సమీపాన హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సీఎం జగన్‌ రోడ్డు మార్గంలో కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం రోడ్డులో నిర్వహించే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ ఏర్పాట్లను, హెలిప్యాడ్‌ను, సీఎం కాన్వాయ్‌ సాగే రోడ్డు, సభాస్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ సోమవారం పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కోరుకొండ సీఐ అడపా నాగమురళి, ఎస్సై ఆనందకుమార్‌ ఆధ్వర్యాన సభా స్థలంలో ఎత్తయిన భవనాలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఆయా భవనాల్లోకి అనుమతులు ఇవ్వరాదని వాటి యజమానులకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో నార్త్‌ జోన్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ ప్రభాకరరావు, సీఐ సూర్య అప్పారావు పాల్గొన్నారు.

సీఎం జగన్‌తోనే సంక్షేమం,  రాష్ట్రాభివృద్ధి
1/1

సీఎం జగన్‌తోనే సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి

Advertisement

తప్పక చదవండి

Advertisement