గ్రామస్థాయిలో జన సురక్ష | - | Sakshi
Sakshi News home page

గ్రామస్థాయిలో జన సురక్ష

Published Sat, Oct 19 2024 2:08 AM | Last Updated on Sat, Oct 19 2024 2:08 AM

గ్రామస్థాయిలో జన సురక్ష

కలెక్టర్‌ షణ్మోహన్‌

కాకినాడ సిటీ: జిల్లాలో రానున్న మూడు నెలల పాటు గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న జన సురక్ష కార్యక్రమాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రయోజనకరమైన కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలలో నమోదు పొందేలా చూడాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి బ్యాంకర్లు, జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లాలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం వివరాల వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. కేంద్ర ఆర్థిక శాఖ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలైన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనపై ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అవగాహన, నమోదు కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని బ్యాంకులు, జిల్లా అధికారులను కోరారు. దేశ ప్రజలకు జీవిత బీమా యోజనను, ప్రధానమంత్రి బీమా భద్రత కల్పిస్తూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను ప్రధానమంత్రి 2015లో ప్రారంభించారన్నారు. ఏడాదికి కేవలం 436 రూపాయల ప్రీమియంతో ప్రమాద బీమాల కింద రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ను నమోదు చేసుకున్న వారికి అందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ జీవన్‌జ్యోతి బీమా యోజనలో 9 కోట్ల 29 లక్షల మంది, సురక్షా బీమా యోజనలో 32 కోట్ల 7 లక్షల మంది నమోదు పొందారన్నారు. అత్యంత ప్రయోజనకరమైన ఈ పథకాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రజలు మరింత ఎక్కువ సంఖ్యలో చేరి లబ్ధి పొందేలా ప్రజా అవగాహన, చైతన్యం పెంపొందించేందుకు రానున్న మూడు నెలల పాటు జన సురక్ష కార్యక్రమాలను గ్రామస్థాయిలో ముమ్మరంగా నిర్వహించాలని కేంద్రప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశంలో 2024–25 సంవత్సరానికి జీవన్‌ జ్యోతి బీమా పథకంలో మరో 13 కోట్ల 9 లక్షల మందిని, సురక్షా బీమా పథకంలో మరో 37 కోట్ల 70 లక్షల మందిని నమోదు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా చేపట్టిందని కలెక్టర్‌ షణ్మోహన్‌ వివరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో రానున్న మూడు నెలల పాటు జన సురక్షా కార్యక్రమాలను ఉద్యమ స్థాయిలో నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ బీమా పథకాల్లో నమోదు పొందేలా చైతన్య పరచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలతో పాటు గ్రామస్థాయిలో సేవా వ్యవస్థ కలిగిన వ్యవసాయం, పశుసంవర్థన, మత్స్య తదితర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామసర్పంచ్‌, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయ సిబ్బంది, బ్యాంక్‌ కరస్పాండెంట్‌, పోస్టల్‌ సిబ్బంది చురుగ్గా పాల్గొని జనసురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, ట్రైనీ కలెక్టర్‌ భావన, ఎల్డీం ప్రసాద్‌, హౌసింగ్‌ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement