వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును టీడీపీ, జనసేనలు వ్యతిరేకించా
కాకినాడ సిటీ: పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టబోయే వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును టీడీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకించి ముస్లింల ప్రయోజనాలు కాపాడాలని ఉమ్మడి రాష్ట్ర ఉర్తూ అకాడమీ మాజీ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఎండి జహీరుద్దీన్ జిల్లానీ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా తీసుకొస్తున్న వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును తమ టీడీపీ మిత్ర పక్షం జనసేనలకు చెందిన ఎంపీలు వ్యతిరేకించాలని కోరారు. దీనివల్ల ముస్లింలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సత్యదీక్షలు ప్రారంభం
అన్నవరం: రత్నగిరిపై సత్యదీక్షలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి జన్మనక్షత్రం శ్రీమఖశ్రీ, ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పసుపు వస్త్రాలు ధరించి తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చక స్వాములు చిట్టిం గోపీ, దత్రాత్రేయశర్మ చేతుల మీదుగా తులసి మాలలు వేయించుకుని సత్యదీక్షలు చేపట్టారు. రత్నగిరిపై సత్యదేవుని ఆలయం వద్ద, కొండ దిగువన నేరేళ్లమ్మ, వినాయకుని ఆలయాల వద్ద సుమారు 500 మంది స్థానిక భక్తులు సత్యదీక్షలు చేపట్టారు. జగ్గంపేట నియోజకవర్గంలో, అడ్డతీగలలోని ఏజెన్సీ ప్రాంతంలో మరో వేయి మంది గిరిజనులు జిల్లా వ్యాప్తంగా ఈ దీక్షలు స్వీకరించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. 27 రోజుల పాటు దీక్ష కొనసాగించి నవంబర్ 23వ తేదీన సత్యదేవుని సన్నిధిన దీక్ష విరమించనున్నారు. కాగా, ఇంటివద్ద పీఠం పెట్టే అవకాశం లేని భక్తుల కోసం దేవస్థానం కళావేదిక మీద పీఠం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉదయం, రాత్రి జరిగే పూజలలో సత్యదీక్ష స్వాములు పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు. ఈ పీఠం ఏర్పాటు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే రామచంద్రమోహన్ పాల్గొన్నారు.
లోవ దేవస్థానంలో భక్తుల రద్దీ
రూ.5.33 లక్షల ఆదాయం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు పెద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో లోవ దేస్థానంలో రద్దీ నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన పది వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు ఇన్‌చార్జ్ కమిషనర్, కార్యనిర్వహణ అఽధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,73,895, పూజా టికెట్లకు రూ.1,10,030, కేశఖండనశాలకు రూ.8,760, వాహన పూజలకు రూ.4050, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.82,396, టోల్ గేటు రుసుములు రూ.55,315, విరాళాలు రూ.99,274 వెరసి మొత్తం రూ.5,33,720లు ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు.
విద్యుత్ చార్జీలు పెంచితే ప్రభుత్వ పతనం ఖాయం
కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రజలపై రూ.6,072 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారని, ప్రజలు భరించలేరని, ఇదే ఇలా కొనసాగితే కూటమి ప్రభుత్వ పతనం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు హెచ్చరించారు. ఆదివారం కాకినాడలోపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2003 సంవత్సరంలో కరెంటు చార్జీల పెంచినందు వల్లే 2004లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిందని, అది పునరావృతం అవుతుందని అన్నారు. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ట్రూ అప్ చార్జీలు ప్రజలపై మోపడం అన్యాయం అన్నారు. ఈ భారాన్ని ప్రభుత్వం భరించాలని మధు డిమాండ్ చేశారు. పలు సమస్యలపై మాట్లాడదామంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా ప్రజలకు అందుబాటులో లేరన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఆలోచించి జిల్లాకు మరో మంత్రిని ఇవ్వాలన్నారు. నూతన మద్యం పాలసీలో ప్రతి పేటలో బెల్ట్ షాపులు వెలిశాయని, ఆయా వార్డుల్లో తిరగడానికి మహిళలు ఇబ్బంది పడుతున్నారని, బెల్ట్ షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఇసుకపై ప్రత్యేక చలానా కౌంటర్ ఏర్పాటు చేయాలని, ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు కె.బోడకొండ, తోకల ప్రసాద్, కె.సత్యనారాయణ, టి.అన్నవరం పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment