మా భూములను వదలం
● ఎయిర్‌పోర్టుకు పంట పొలాలను ఇచ్చేది లేదని స్పష్టం చేసిన రైతులు
● ఇప్పటికే పోలవరం, పుష్కర, హైవే, రైల్వేలైన్లకు ఇచ్చి నష్టపోయామని ఆవేదన
● ఖాళీగా ఉన్న కేఎస్‌ఈజెడ్ భూములో ఎయిర్‌పోర్టు పెట్టుకోవాలని డిమాండ్
● బెండపూడిలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు
తొండంగి: తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న రెండు పంటలు పండే వరి భూములను వదులుకునే ప్రసక్తి లేదని బెండపూడి, పి.ఇ.చిన్నాయపాలెం ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు భూముల బాధిత రైతులు స్పష్టం చేశారు. బెండపూడి, పి.ఇ.చిన్నాయపాలెం ప్రాంతాల్లో విమానాశ్రయం కోసం 757 ఎకరాల జిరాయితీ వరి పొలాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఆదివారం బెండపూడిలో ఈ భూములకు సంబంధించిన రైతులు సమావేశమయ్యారు. గతంలో పోలవరం కాలువ, పుష్కర కాలువ, జాతీయరహదారి నిర్మాణం, రైల్వే లైనులకు వందలాది ఎకరాలను ఇచ్చి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఎయిర్‌పోర్టు పేరుతో 800 ఎకరాలను సేకరిస్తే సాగుపై ఆధారపడిన కౌలు రైతులు, కూలీలు ఇతర వర్గాల ప్రజల జీవనోపాధి పోతుందన్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులే అధికంగా ఉన్నామన్నారు. ప్రతిపాదించిన భూములన్నీ ప్రస్తుతం మార్కెట్‌లో ఎకరా ధర జాతీయ రహదారిని ఆనుకుని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు పలుకుతోందని, మిగిలిన ప్రాంతంలో రూ.80 లక్షలకు పైగా పలుకుతుందని వివరించారు. ఖరీదైన భూములను నష్టపోవడంతోపాటు జీవనోపాధి పోతుందన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో దశాబ్దం క్రితం సేకరించిన కేఎస్‌ఈజెడ్ భూములు ఖాళీగా ఉన్నాయని అవసరమైతే అక్కడకు తరలించాలని కొంతమంది రైతులు సూచించారు. పవిత్రమైన అన్నవరం పుణ్యక్షేత్రాన్ని నోఫ్‌లై జోన్‌గా ప్రకటించాలని, ఎయిర్‌పోర్టు రాకతో ప్రశాంతమైన పచ్చని ప్రాంతంలో ధ్వని, పర్యావరణ కాలుష్యంతోపాటు భక్తుల ఏకాగ్రత దెబ్బతింటుందన్నారు. కాగితమ్మ చెరువు ఆయకట్టు ప్రాంతం కావడంతో ఏటా రెండు పంటలు పండుతాయని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎయిర్‌పోర్టు వల్ల ముంపు బారిన పడతాయని అన్నారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు వల్ల సాగునీటి ప్రవాహానికి అంతరాయం, అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టును ఇక్కడ నుంచి తరలిస్తామని స్పష్టమైన హామీ వచ్చే వరకు సమష్టిగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment