హోరాహోరీగా క్రికెట్ పోటీలు
అమలాపురం టౌన్: అమలాపురంలో ఏకకాలంలో మూడు క్రీడా మైదానాల్లో అంతర్ జిల్లాల బాలుర అండర్– 14 క్రికెట్ పోటీలు రెండో రోజు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రాష్ట్ర స్థాయి లీగ్ కమ్ నాక్ అవుట్ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన జట్లు తలపడుతున్నాయి. అయితే బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి కురిసిన వర్షంతో మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. క్వార్టర్స్ ఫైనల్‌కు వచ్చిన జట్టు తలపడేందుకు సిద్ధమవుతున్న సమయంలో అప్పటికే ఈదురు గాలులతో వర్షం పడింది. క్వార్టర్ ఫైనల్స్‌ను మూడో రోజు శనివారం నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట రవి తెలిపారు. అమలాపురంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం, బాలయోగి స్టేడియం, కిమ్స్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 250 మంది క్రీడాకారులతోపాటు పోటీలను వీక్షించేందుకు వచ్చిన క్రీడాభిమానులతో ఆ మైదానాల్లో సందడి కనిపించింది. బాలయోగి స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ పోటీలను డీఈఓ షేక్ సలీమ్ బాషా తిలకించారు. భోజనాలు, ఇతర వసతి ఏర్పాట్లపై క్రీడాకారులను డీఈఓ ఆరా తీశారు. జిల్లా ఏఎస్పీ ప్రసాద్ కూడా బాలయోగి స్టేడియంలో మ్యాచ్‌లను చూశారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకుడు పీఎస్ సురేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఏవీ శ్రీనివాస్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి బీవీఎస్ మూర్తి, బాలయోగి స్టేడియం ఇన్‌చార్జి, ఫిజికల్ డైరెక్టర్ పాయసం శ్రీనివాసరావు, మరో ఫిజికల్ డైరెక్టర్ కామన మధుసూదనరావుతో పాటు జిల్లాకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు మ్యాచ్‌లకు రిఫరీలుగా వ్యవహరిస్తున్నారు.
రెండో రోజు శుక్రవారం లీగ్ మ్యాచ్‌లలో భాగంగా స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా స్థలంలో మూడు మ్యాచ్‌లు జరిగాయి. తొలుత గుంటూరు జిల్లా, కడప జిల్లా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోటీల్లో కడప జిల్లా 4 వికెట్లతో తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌గా తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల జట్లు తలపడ్డాయి. 9 వికెట్ల తేడాతో శ్రీకాకుళం విజేతగా నిలిచింది. మూడో మ్యాచ్ శ్రీకాకుళం, కడప జిల్లాల జట్ల మధ్య జరిగింది. కేవలం ఒక పరుగు తేడాతో కడప విజయం సాధించింది. బాలయోగి స్టేడియంలో తొలుత కర్నూలు, కృష్ణా జిల్లాల జట్ల మధ్య పోటీ జరిగింది. ఆరు వికెట్ల తేడాతో కృష్ణా జిల్లా విజయకేతనం ఎగుర వేసింది. తర్వాత అనంతపురం, నెల్లూరు జిల్లాల మధ్య మ్యాచ్ జరిగింది. 26 పరుగుల తేడాతో అనంతపురం విజయం సాధించింది. మూడో మ్యాచ్ కర్నూలు, విజయనగరం జిల్లాల మధ్య జరిగింది. 10 వికెట్ల తేడాతో కర్నూలు గెలిచింది. అలాగే కిమ్స్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో తొలి మ్యాచ్ విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల జట్ల మధ్య జరిగింది. కేవలం ఒకే ఒక పరుగుతో విశాఖపట్నం గెలిచింది. తర్వాత గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల మధ్య పోటీలో 10 వికెట్ల తేడాతో తూర్పుగోదావరి జిల్లా విజయం సాధించింది. మూడో మ్యాచ్ చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల జట్ల మధ్య జరిగింది. 8 వికెట్ల తేడాతో చిత్తూరు జిల్లా జట్టు గెలిచింది.
తలపడిన పలు జిల్లాల జట్లు
సాయంత్రం వర్షంతో అంతరాయం
Comments
Please login to add a commentAdd a comment