తండ్రి చెంతకు మతిస్థిమితం లేని యువకుడు
తుని: మతిస్థిమితం లేని యువకుడిని అతని తండ్రికి అప్పగించినట్లు స్థానిక రైల్వే పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆ వివరాల్లోకెళితే.. ఈ నెల 27న చైన్నె– హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మతిస్థిమితం లేని యువకుడు షేక్ రిపన్ (25) లోదుస్తులతో తిరుగుతూ తుని రైల్వే స్టేషన్లో దిగాడు. స్టేషన్ మాస్టర్ రూమ్‌లోకి ప్రవేశించి ఇబ్బంది పెట్టడంతో ఆయన రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు ఆదేశాలతో సిబ్బంది రిపన్‌ను రైల్వే పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. అతను పశ్చిమ బెంగాల్ మురారి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించి ఫోన్లో తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. రైల్వే పోలీసులు శుక్రవారం రిపన్‌ను అతని తండ్రి షేక్ నజీముద్దిన్‌కు అప్పగించారు.
చెల్లని చెక్కు కేసులో
ఏడాది జైలు
కాకినాడ లీగల్: చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు, రుణదాతకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ చెందిన సలాది సూరిబాబు వద్ద సర్పవరానికి చెందిన జుత్తుక వెంకట నరేష్ 2020లో రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. బాకీ తీర్చేందుకు 2023లో రూ.5 లక్షల చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కును సూరిబాబు బ్యాంక్‌లో వేయగా బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించాడు. ఈ విచారణలో వెంకట నరేష్ నేరం రుజువు కావడంతో ఏడాది జైలు, రూ.5 లక్షలు ఇవ్వాలని తీర్పు చెప్పారు.
చెరువులో స్నానానికి దిగి విద్యార్థి మృతి
నల్లజర్ల: స్థానిక హెచ్‌పీ గ్యాస్ గొడౌన్ సమీపంలో ఉన్న పేరంటాల గుంట చెరువులో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో నల్లజర్ల జెడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థి గుడిశే జ్యోతిప్రకాష్ (15), జంపల్లి రాజేష్ (పదో తరగతి), ములపర్తి హేమంత్‌కుమార్ (7వ తరగతి), ములపర్తి లక్ష్మీనారాయణ (7వ తరగతి), తాడే యువరాజు (9వ తరగతి) స్కూల్ మానేసి స్నానానికి వెళ్లారు. ఈత నేర్చుకోవడానికి చెరువులో దిగిన జ్యోతిప్రకాష్ నీట మునిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని నల్లజర్ల పీహెచ్‌సీకి తీసుకెళ్లగా, అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందినట్లు డాక్టరు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు పోలీసు కేసు వద్దని జ్యోతిప్రకాష్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment