చివరిలో చినుకు భయం
ఉప్పాడ–కాకినాడ బీచ్‌రోడ్డుపైకి ప్రవహిస్తున్న సముద్రనీరు
● కోతలు కోసి పనలపై ఉన్న పంట
● జిల్లాలో ఇప్పటికే 1.2 లక్షల
ఎకరాల్లో పూర్తయిన కోతలు
● 30 నుంచి 35 బస్తాల దిగుబడి
● అన్నదాతను బెంబేలెత్తిస్తున్న
వాతావరణ హెచ్చరికలు
● సర్వత్రా ఫెంగల్ గుబులు
సాక్షి, ప్రతినిధి, కాకినాడ: ఫెంగల్ తుపాను ఖరీఫ్ రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. వాయుగుండం కాస్తా తీవ్ర తుపానుగా మారిందనే సమాచారం రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 48 గంటలుగా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయి చలి గాలులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటి వరకూ 1.20 లక్షల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారు. ఎకరాకు 30 నుంచి 35 బస్తాలు దిగుబడి వచ్చిందని సంతోషించాలో ఇప్పుడు తుపానుతో పంట చేతికి రాకుండా పోతుందేమో అని ఆందోళన చెందాలో అర్థం కాక రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం తడిసి తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో మిల్లర్లు, ధాన్యం కమీషన్ ఏజంట్లు 75 కేజీల బస్తాకు రూ.100 నుంచి రూ.150 కోత పెడుతున్నారు. దీంతో నాలుగైదు రోజులుగా తేమ లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. అదే ఇప్పుడు ఫెంగల్ తుపాను రూపంలో తమ కొంప ముంచేలా ఉందని దిగులు చెందుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో పంట రోడ్లు, కళ్లాల్లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అంతటా రైతులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాసూళ్లు చేసుకోవడంలో అన్నదాత బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో తుపాను అంటేనే చేతికొచ్చిన పంట ఏమైపోతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం జిల్లా అంతటా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో నూర్పిడి పూర్తి చేసుకున్న పంటను ఒబ్బిడి చేసుకోవడంలో రైతులు తలమునకలై ఉన్నారు. మరో 48 గంటల పాటు వరి కోతలు ఆపేయాలని వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే కోతలు మొదలై పంట నూర్పిళ్లు పూర్తి అయిన ప్రాంతాల్లో రైతులు మాత్రం సమీపంలో ఉన్న జాతీయ రహదారులు, మెరక ప్రాంతాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. బరకాల మీద బరకాలు వేసి ధాన్యాన్ని కప్పుతున్నారు. మరికొందరు పురులు కట్టుకునే పనిలో ఉన్నారు. జిల్లాలో కాకినాడ రూరల్, కరప, జగ్గంపేట, గోకవరం, ఏలేశ్వరం, సామర్లకోట, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి తదితర మండలాల్లో వరి కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో రైతులకు ముచ్చెమటలు పడుతున్నాయి. తుపాను ప్రభావంతో వర్షాలు మరో 48 గంటలు ఆగితే చాలు ఖరీఫ్ పంట నుంచి గట్టెక్కేస్తామని రైతులు చెబుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 17,143 హెక్టార్లలో వరిసాగు చేస్తే ఇంత వరకూ 50 శాతం కోతలు పూర్తి చేశారు. కోతలు పూర్తి అయిన ప్రాంతాల్లో తుపాను ప్రభావం నుంచి బయటపడవచ్చుననే ముందు చూపుతో కొందరు రైతులు కుప్పలు వేసుకున్నారు. కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో సుమారు 20 వేల హెక్టార్లలో వరి కోతలు ఇంకా పూర్తి కాలేదు. ఇందులో అత్యధికంగా గొల్లప్రోలు మండలంలోనే సుమారు 15 వేల హెక్టార్లలో వరికోతలు చేద్దామని తుపాను హెచ్చరికలతో భయపడి రైతులు ఆపేశారు. ఇటీవల ఏలేరు వరదలతో పంట పొలాలు నీట మునగడంతో ఇక్కడ ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. మెట్ట కేంద్రమైన జగ్గంపేట నియోజకవర్గంలో దాదాపు నాలుగు మండలాల్లో 70 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. ఇక్కడ ఏలేరు ఆయకట్టు రైతులు యంత్రాలతో కోతలు చేయడం కలిసి వచ్చిందని చెప్పొచ్చు. లేదంటే ఇప్పటికీ 30 శాతం కూడా వరి కోతలు పూర్తి అయ్యేవే కావంటున్నారు. అదే ఈ రోజు తమకు గెండెలపై భారాన్ని దింపేసిందంటున్నారు. మెట్ట ప్రాంత కేంద్రమైన జగ్గంపేట నియోజకవర్గంలో 30 వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఈ ప్రాంతంలో 70 శాతం కోతలు యంత్రాలతో చేయడంతో రైతులు కొంత వరకు గట్టెక్కారని చెప్పొచ్చు. నియోజకవర్గంలో సుమారు 15 వేల ఎకరాల్లో వరి పంట కుప్పలపై జాగ్రత్త చేసుకున్నారు. ఏడెనిమిది వేల ఎకరాల్లో పనలు, ఆరు వేల ఎకరాల్లో ధాన్యం కళ్లాల్లో ఉంది. నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటతో పాటు కాట్రావులపల్లి, మండల కేంద్రం గోకవరం మండలం తంటికొండ, గాదిలపాలెం గ్రామాల్లో రైతులు ధాన్యాన్ని రాశులుగా పెట్టుకుని ఆరబెట్టుకుంటున్నారు. ఖాళీ భూములు, జాతీయ రహదారులపై బరకాలు వేసి వాటిపైఽ ధాన్యాన్ని వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏలేరు ఆయకట్టు పరిధిలో ముందుగా నాట్లు వేసిన కాట్రావులపల్లి, సీతానగరం, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో వరి నూర్పిళ్లు జరుగుతున్నాయి. పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు 40 వేల ఎకరాల్లో వరి సాగు జరిగితే ఇప్పటి వరకు 50 శాతం వరి కోతలు పూర్తి చేశారు. సామర్లకోట మండలం పవర, నవర, గొంచాల, వీకే రాయపురం తదితర గ్రామాల్లో ఆలస్యంగా నాట్లు వేయడంతో పంట చేతికొచ్చి సిద్ధంగా ఉంది. కోతలు ఇంకా పూర్తికాకపోవడంతో వర్షాలు పెరిగితే పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి, కోటనందూరు, కాకరాపల్లి, కేఏ మల్లవరం తదితర గ్రామాల్లో వరి పంట ఈదురుగాలులకు నేలనంటేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికందే దశలో తుపాను వచ్చి పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుని రూరల్ మండలం ఎస్.అన్నవరం, హంసవరం, అగ్రహారం గ్రామాల్లో పంట పనలు, కళ్లాల్లో ఉండటంతో ఈ గండం నుంచి గట్టెక్కడం ఎలా దేవుడా అంటూ రైతులు ఎదురుచూస్తున్నారు. కాకినాడ రూరల్ కరప మండలంలో వరి కోతలు పూర్తి అయి సుమారు ఆరు వేల ఎకరాల్లో పంట రాశుల మీద ఉండి రైతులు ఆందోళన చెందుతున్నారు. 540 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుకు పంపడానికి సిద్ధంగా ఉండడంతో అన్నదాత తాజా తుపాను హెచ్చరికలతో భయపడుతున్నారు. కరప మండలం పెద్దాపురప్పాడు, యండమూరు, కూరాడ, కరప గ్రామాల్లో కోసిన చేను పనలపై, కుప్పల మీద ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వలసపాకల, వేములవాడ, కొరుపల్లి, అరట్లకట్ట, పాతర్లగడ్డ తదితర గ్రామాల్లో రోడ్డు పక్కన, లే అవుట్లలో ధాన్యం రాశులపై బరకాలు కప్పి రైతులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏలేశ్వరం మండలంలోని లింగంపర్తి, భద్రవరం, పేరవరం గ్రామాల్లో కోసిన వరిపనలను రైతులు ఒబ్బిడి చేసుకుంటున్నారు. ప్రత్తిపాడు మండలం లంపకలోవ, ఉత్తరకంచి తదితర ప్రాంతాల్లో రైతులు కోసిన వరి పనలను నూర్పులు చేశారు. వర్షాలకు వరి పనలు తడిసిపోగా పలు రహదారులపై ఆరబెట్టడం కనిపించింది. తుపాను పోతేనే గాని తమ గుండెలపై కుంపటి దిగదని రైతులు పేర్కొంటున్నారు.
ధాన్యం తడిసిపోతుందని ఆందోళన
నేను రెండు ఎకరాల వరి పంటను కోసి కూప్ప నూర్చాను. ఈ లోపు తుపాన్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నాలో ఆందోళన మొదలైంది. ధాన్యాన్ని ఖాళీ ప్రదేశంలో తడవకుండా బరకాలు వేసి జాగ్రత్తపెట్టాను. భారీ వర్షం వస్తే ఏం చేయాలో తెలియడంలేదు. దేవుడు కనికరించి వర్ష ప్రభావం లేకపోతే పంటను అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి వీలుంటుంది.
– ఇమ్మల్లి, శ్రీను, రైతు కాట్రావులపల్లి,
జగ్గంపేట మండలం
పంట చేతికొచ్చే సమయంలో..
పంట చేతికి వచ్చే సమయంలో తుపాన్ రావడంతో ఆందోళన కలుగుతోంది. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో తుపాను వల్ల భారీ వర్షం కురిస్తే పంట మొత్తం పాడయ్యే అవకాశం ఉంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాను.
– కె.తాతీలు, రైతు, రమణక్కపేట, కొత్తపల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment